భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

15హైదరాబాద్‌: మంగళవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షతో ప్రారంభమైన మార్కెట్ల పతనం… ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులపై ఐఎండీ వెల్లడించిన అంచనాలతో మరింత కిందకు జారాయి. ఈ రెండూ అంశాలు స్టాక్‌మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 661 పాయింట్లు నష్టపోయి 27,188 వద్ద ముగియగా, జాతీయ స్టాక్‌ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 197 పాయింట్లు నష్టపోయి 8,236 వద్ద ముగిసింది.రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షపాతం 93 నుంచి 88శాతానికి తగ్గుతుందని ఐఎండీ అంచనా వేయడంతో స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపి నష్టాల బాట పట్టాయి.
ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మంగళవారం వెల్లడించారు. రెపో రేటును 0.25 శాతం తగ్గించినట్లు చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని తెలిపారు. జనవరి నాటికి ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరుకుంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాను 7.8 నుంచి 7.6 శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ఆగస్టు నెలాఖరు నాటికి కొత్త బ్యాంకులకు లైసెన్స్‌లు మంజూరు చేయనున్నట్లు రఘురామ్‌రాజన్‌ తెలిపారు. ఆర్‌బీఐ సమీక్షతో ఉదయమే స్టాక్‌మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. రెపో రేటు తగ్గింపు ప్రభావంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోయాయి.