భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

3హైదరాబాద్‌ : వరసగా రెండు వారాల పాటు నష్టాలపాలైన స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో మొదటి రోజు కూడా అదే బాటలో పయనించాయి. సోమవారం దేశీయ సూచీలు భారీ నష్టాల్ని మూటగట్టుకున్నాయి. ఉదయం నుంచి వూగిసలాట మధ్య సాగిన ట్రేడింగ్‌ చివరికి భారీ నష్టాల దిశగా సాగింది. దీంతో సెన్సెక్స్‌ 266 పాయింట్లు నష్టపోయి 24,188 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 86 పాయింట్లు నష్టపోయి 7,351 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.68 వద్ద కొనసాగుతోంది.

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో బీహెచ్‌ఈఎల్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 3.74శాతం లాభపడి రూ.141.50 వద్ద ముగిశాయి. వీటితోపాటు టాటా స్టీల్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో సంస్థల షేర్లు సైతం లాభాలతో ముగిశాయి.

అలాగే కెయిర్న్‌ ఇండియా సంస్థ షేర్లు అత్యధికంగా 7.57శాతం నష్టపోయి రూ.110.55 వద్ద ముగిశాయి. వీటితోపాటు వేదాంత లిమిటెడ్‌, రిలయన్స్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ సంస్థల షేర్లు సైతం నష్టాలతో ముగిశాయి.