భారీ బీభత్సం సృష్టించిన ‘నివర్‌’

చెన్నై,నవంబరు 27(జనంసాక్షి):తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం భారీనే జరిగింది. మరోవైపు తుపాను కారణంగా వీస్తున్న గాలులకు చెట్లు విరిగిపడి.. ట్రాఫిక్‌, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీవిూటర్ల వర్షం పడింది.కడప జిల్లా సీకే దిన్నే మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రాధాన రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరోవైపు నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. సోమశిల, కండలేరు నుంచి భారీగా సముద్రంలోకి నీటి విడుదల చేశారు. ఇక నివర్‌ తుఫాన్‌ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది.ఇక తుపాను సహాయక చర్యలను సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావంతో చెరువులకి గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. బాధితులకు సకాలంలో ఆహారం, తాగునీరు, మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.