భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలి
-రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ బ్యూరో-జూలై23(జనంసాక్షి)
భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపి మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో కలిసి జిల్లాలో కురిసిన భారీ వర్షాల దృష్ట్యా ఏర్పడిన పరిస్తితులపై, చేసిన ఏర్పాట్లపై, నష్టం వివరాలను జిల్లా అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం నుండి రాష్ట్రంలో అధిక వర్షాలు కురిసిన నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో అధికంగా వర్షపాతం నమోదు అయిందని, గతంలో మొదటి పది రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పుడు మన జిల్లాలో తక్కువ వర్షాలు నమోదై కొంత మేర సేఫ్ గా ఉన్నామని, కానీ శుక్రవారం ఉదయం నుండి కురిసిన భారీ వర్షాలతో చెరువులు నిండి రోడ్లు, కాజ్ వే, లో లెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు పారి రహదారులు పూర్తిగా మూసివేసి ట్రాఫిక్ నీ మరో మార్గంలో పంపడం జరుగుతున్నదని తెలిపారు. ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది అందుబాటులో ఉండడం, అధికారులు అలెర్ట్ గా ఉండడంతో మరిపెడ మండలంలో కూలీలను రక్షించడం జరిగిందని, వారిని కలిసి వస్తున్నానని, వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారని, ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు, టీమ్ బాగా పని చేశారనీ తెలిపారు. వర్శాలు పడుతున్న దృష్ట్యా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని, మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని, టెస్ట్ లు పెంచాలని, వైద్య పరంగా అవగాహన కల్పించి ప్రజలలో నమ్మకం, ధైర్యం కల్పించాలని తెలిపారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా చూడటంలో చాలా మటుకు విజయవంతం అయ్యామని తెలిపారు. ప్రజలు సొంత ప్రయోగాలు చేయడం మానుకోవాలని, ప్రాణ నష్టం జరగకూడదని,
తోర్రురు కంటాయపాలేంలో అధికారులు చెప్పిన వినకుండా దాటడానికి ప్రయత్నం చేసి కొట్టుకొని పోవడం జరిగిందని, ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది అక్కడే వుండి సెర్చ్ చేస్తున్నారని తెలిపారు. తొర్రూరు లోని ఆర్యభట్ట ప్రైవేట్ స్కూల్ పిల్లల బస్ లో లెవెల్ బ్రిడ్జి పై నుండి నీరు ప్రవహిస్తున్నప్పటికి 16 మంది చిన్నారుల లైఫ్ రిస్క్ పెట్టీ మూర్ఖంగా దాటాలని ప్రయత్నం చేయడం జరిగిందని, పెను ప్రమాదం తృటిలో తప్పిందని, స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవడం జరిగిందని, అలాంటివి పునరావృతం కావద్దని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అపోహలు వీడాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో మంత్రసాని వ్యవస్థ అమలులో ఉన్నదని, బడాయికి పోయి ప్రాణాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలు చేసుకునే విధంగా గర్భిణీ స్త్రీలకు తగు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆస్తి నష్టం గుర్తించాలని, పత్తికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను వేసే విధంగా చూడాలని, పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా వివరాలు, ఆర్ అండ్ బి, పి.ఆర్., ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు ఎక్కడ దెబ్బ తిన్నాయి, నష్ట పోయిన వాటిని కలిపి ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని, చెరువులు నిండి మత్తడి పోస్తున్నందున చెరువు క్రింది గ్రామాలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలకు ఖాళీ చేయించి రీలీఫ్ సెంటర్ లకు తరలించాలని తెలిపారు. ట్రాఫిక్ డైవర్షన్ చేసిన ప్రదేశంలో సైన్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. కట్టలు తెగకుండ వాటి స్థితిగతులను పరిశీలించాలని, వ్యవసాయ ఏ. ఈ.లు ఫీల్డ్ లో ఉండాలని, విద్యుత్ లైన్ లు తెగిపోయినప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రమాదం జరుగకుండా చూడాలని తెలిపారు. వర్షాలు కురిసినా తర్వాత ఏర్పడిన పరిస్థితుల నుండి బయటపడే విధంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, చెరువులు మత్తడి పోస్తున్న క్రింద ఉన్న గ్రామాలు దెబ్బ తినకుండా, కట్టలు, డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని షిఫ్ట్ పద్ధతి ద్వారా అధికారులను నియమించలని, పారిశుధ్యం కొరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల దృష్ట్యా ప్రతి గ్రామంలో, మండలంలో టీమ్ లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నారని, శుక్రవారం ఉదయం నుండి కురిసిన వర్షాలకు దంతాలపల్లిలో 22 సెంటి మీటర్ లు నమోదు అయిందని, 1622 చెరువులకు 1340 చెరువులు 85 శాతం నిండాయని, ఒక్క రోజే 34 విద్యుత్ పోల్స్ దెబ్బ తిన్నాయని, పాత ఇళ్ళ నుండి, శిధిలావస్థలో ఉన్న ఇళ్ల నుండి రెవెన్యూ, పోలీస్ శాఖ సమన్వయంతో తరలించడం జరిగిందని, తొర్రూరు కంటాయపలెం వాగు మత్తడి పారుతున్న సందర్భంలో ఒక వ్యక్తి పశువుకు మేత కావాలని మొండిగా వ్యవహరించి వెల్లి దురదృష్ట వశాత్తూ కొట్టుకొని పోయారని, రాత్రి నుండి ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది తో సెర్చ్ చేయడం జరుగుతున్నదని తెలిపారు. అలాగే మరిపెడలో 22 మంది కూలీలు సూర్యాపేట జిల్లా ముకుందాపురం లో నాట్లు వెయ్యడానికి వెళ్లి మరిపెడ మండలం పాలేరు వాగులో చిక్కుకోగా, ఎన్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది, జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా సేఫ్ గా తీసుకొని రావడం జరిగిందని తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లాలో అందిస్తున్న సేవలు, సి సెక్షన్ పై సమీక్షించి మొదటి కాన్పు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని చర్యలు తీసుకుంటున్నామని, అవగాహన.కల్పిస్తున్నామని, గతంలో 99 శాతం ఉన్న సి సెక్షన్ లు సమీక్షలు నిర్వహించి పర్యవేక్షించడం తో 91 శాతం కు తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి, ఎమ్మెల్సీ, అదనపు కలెక్టర్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధికారులు తమ శాఖ పరిధిలో జరిగిన నష్టం వివరాలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతం, ఆర్డీవో లు కొమురయ్య, ఎల్. రమేష్, జెడ్పీ సి. ఈ. ఓ. రమాదేవి, సి.పి. ఓ. సుబ్బా రావు, పశు సంవర్దక శాఖ అధికారి డాక్టర్ టి.సుధాకర్, ఎన్.పి.డి.సి.ఎల్. ఎస్.ఈ. నరేష్, డి.పి. ఓ. సాయి బాబా, ఆర్ అండ్ బి. – ఈ. ఈ. తానేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ డి.ఈ., డి.హెచ్.ఎస్. ఓ. సూర్య నారాయణ, డి. ఈ. ఓ. ఎం.డి.అబ్దుల్ హై, డి. ఏ. ఓ. చత్రు నాయక్, ఇరిగేషన్ ఎస్. ఈ. వెంకటేశ్వర్లు, ఈ.ఈ. వెంకటేశ్వర్లు, సుదర్శన్ రావు, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న రాణి,డిడబ్ల్యూఓ నర్మద, డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్. ఓ..అంబరీష, కలెక్టరేట్ సెక్షన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.