భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:

జిల్లా కలెక్టర్ కే శశాంక
అడిషనల్ ఎస్పీ యోగేష్ గౌతమ్

దంతాలపల్లి జూలై23 జనంసాక్షి

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు, అధికారులు అప్రమత్తo గా ఉండాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు.శనివారం మండలంలోని పెద్దముప్పారం గ్రామ శివారు నుండి పాలేరు నది ఉప్పొంగి ప్రవహిస్తున్నoదున ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు పకడ్బంది ఏర్పాట్లు చెయ్యాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…శుక్రవారం ఒక్కరోజులొనే 22 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని చెరువులు, కుంటలు మత్తల్లు పడుతున్నాయని వాగులు కాలువలు ఉధృతంగా అధికవేగంగా ప్రవహిస్తున్న దృష్ట్యా చాపలవేట కు,ఈతలకు,నీళ్లను చూసేందుకువెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు.అత్యవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు వెళ్లకూడదని, పిడుగులు పడే అవకాశం ఉందని, పశువులను పాకల్లోనే కట్టేసి మేపుకోవాలని,బట్టలు అరవేసుకునే సమయాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అవసరం మేరకు ఇసుక నింపుకొని బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ప్రయాణాలు చేసే సమయంలోవాహనదారులు వరద తీవ్రత కు రోడ్లు కోతకు గురైన రోడ్లపై ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వరద తీవ్రత పూర్తిస్థాయిలో తగ్గేవరకు గ్రామ పంచాయతీ సిబ్బంది తో హెచ్చరిక బోర్డులను, బారికేడ్లు,ముళ్ల కంపలతో రవాణా నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు అడిషనల్ ఎస్ పి యోగేష్ గౌతమ్ ఆర్డిఓ రమేష్ ,తహసిల్దార్ కిషోర్ కుమార్, ఎంపీడీవో బండి గోవిందరావు, ఇరిగేషన్ ఈఈ లు వెంకటేశ్వర్లు, సుదర్శన్ రావు, మండల స్థాయి అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.