భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – ప్రతి చెరువులో నీటి నిల్వలు పర్యవేక్షించాలి – లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి – మంథనిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


జనంసాక్షి, మంథని :
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గత సంవత్సరం వరద ఉదృతి అధికంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. మంథనిలోని మాతా శిశు ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్, ఆసుపత్రిలో ప్రాధాన్యత ప్రకారం చేపట్టాల్సిన పనులు వివరాలు నివేదిక సమర్పించాలని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందే దిశగా అవసరమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మాతా, శిశు ఆసుపత్రి సమీపంలో గల డంపింగ్ యార్డ్ ను ఇతర ప్రాంతానికి తరలించే దిశగా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంథని పట్టణంలో గత సంవత్సరం వరద అధికంగా వచ్చిన ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి రాబోయే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని కలెక్టర్ సూచించారు. వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మంథని పట్టణంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి, ప్రజలను తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ అధికారులు పట్టణ పరిధిలో గల పురాతన శిథిల భవనాలు, గోడలు కూలె పరిస్థితులు ఉన్నట్లైతే, వాటిని గుర్తించి నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. పట్టణంలో ఉన్న చెరువులు, వివిధ ప్రాజేక్టుల కాల్వలు నీటి నిల్వలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, చెరువులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. లోతట్టు వంతెనల వద్ద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నీటి ప్రవాహం అధికం అయితే దారులను మూసివేసి బారికేడ్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతంగా చేపట్టాలని, విద్యుత్ వైర్లు తెగి పడిపోయినట్లయితే వెంటనే మరమత్తులు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్థి, జంతు నష్టం వాటిలకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని మున్సిపల్ కమిషనర్ శారద, తహసిల్దార్ గిరిధర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.