భూగర్భ జలసంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
నగర జనాభా విస్తరిస్తోంది. నగరాలు విస్తరించి పట్టణాలుగా మారుతున్నాయి. పల్లెలనుంచి ప్రజలు పనుల కోసం నగరాలపై ఆధారపడుతున్నారు. దీంతో శివారు ప్రాంతాల్లో వచ్చి వారు ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇక్కడే ఉండిపోతున్నారు. గ్రామాలు నిర్వీర్యం కావడంతో పట్టణాలపై భారం పడుతోంది. అయితే పట్టణీకరణను ప్రభుత్వం అభివృద్దిగా చూస్తోందే తప్ప పల్లెలు వట్టిపోతున్నాయని గుర్తించడం లేదు. దీంతో గ్రావిూణ ఆర్థకి వ్యవస్థ పర్తిగా దెబ్బతింటోంది. పట్టణాల కారణంగా విద్యుత్, మంచినీటి అవసరాలు కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. ప్రధానంగా గ్రామాల్లో చెరువుల ధ్వంసం కావడం, వ్యవసాయం భారంగా మారడం వల్ల నగరీకరణ పెరుగుతోంది. మన పూర్వీకులు బావుల్లో నిండుగా నీళ్లను చూశారు. వర్షపు నీటితో నిండుకున్న చెరువులను, కుంటలను చూశారు. నిండుగా ప్రవహించే కాలువలను చూశారు. పచ్చటి పొలాలను చూశారు. పశుగ్రాసంతో ఆరోగ్యంగా వున్న పశు సంపదను చూశారు. మంచి ఆహారం తీసుకుని బలంగా, పుష్టిగా ఉన్న మనుషులను చూశారు. ఇవన్నీ క్రమంగా తగ్గిపోతున్న క్రమంలో వాటి విలువ తెలియడం లేదు. నేటి తరానికి నీటి ప్రాధాన్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు బొత్తిగా తెలియడం లేదు. పట్టణాల్లో స్థిరపడుతున్న వారు సైతం బోర్లు వేసి లేదా జలమండలి అందిచే నీటిని వినియోగిస్తున్నారే తప్ప నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో నగరభూగర్భం నీరులేకుండా వట్టిపోతోంది. ఇంటికో బోరుతో ఉఎన్న నీరు ఆవిరయిపోతోంది. ఒకప్పుడు నగరానికి చుట్టుపక్కల 2800 చెరువులుండేవని, భూగర్భ జలాలు అందుబాటులో ఉండి నగర ప్రజలకు నీటి ఇబ్బందులు ఉండేవి కావని చరిత్ర చెబుతున్న సత్యం.అయితే మన రాజకీయ నేతలు, రియల్ బకాసరులు వాటిని మింగేశారు. చెరువులు కాస్తా అపార్ట్‌మెంట్లు అయ్యాయి. అందుకే అప్పుడప్పడు భారీ వర్షలకు కూకట్‌పల్లి లాంటి ప్రాంతాలు మునిగిపోతున్నాయి. నేటి నగర జనాభా ఒక కోటి ఇరువై లక్షల పైమాట. ఔటర్ రింగ్ రోడ్‌కు లోపల ఉన్న 193 గ్రామాలు కూడా నగర పరిధిలోకి రావడంతో ఆయా గ్రామాలకు కూడా మంచినీటిని సరఫ రా చేసే బాధ్యత జలమండలిపై పడింది. రోజూ లక్షలాది మంది హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ పోతుంటారు. గ్రామాల్లో పని లభించక వేలాదిమంది ఇక్కడే సెటిలయిపోతున్నారు. ఇంతమందికి నీరు అందించాల్సిన అసవరం నగరంపై పడింది. పెరుగుతున్న నగర జనాభాకు అవసరమైనరీతిలో నాటి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లకు అదనంగా, మంజీరా మొదటి దశ,రెండవ దశ, సింగూరు మూడవ, నాలుగవ దశల్లో పైప్‌లైన్లు వేసి నగర జనాభాకు మంచినీటిని హైదరాబాద్ జలమండలి అందిస్తున్నది. నగర జనాభా మరింత పెరుగడంతో 2005లో నాగార్జునసాగర్ నుంచి కృష్ణానది నీళ్లు తీసుకురావడం ప్రారంభమైంది. జనాభా మరింత పెరుగడంతో 2015లో గోదావరినది నీటిని ఎల్లంపల్లి రిజర్వాయర్ ద్వారా అందించడం మొదలైంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి రోజుకు సుమా రు 430 మిలియన్ గ్యాలన్స్ నీటిని పంపింగ్ చేస్తూ నగరంలోని పెద్ద రిజర్వాయర్లలో నింపి అన్ని ప్రాంతాలకు మంచినీటిని అందిస్తున్నది. ప్రజలు నీటిని సంరక్షించు కోవడం నేర్చుకోవాలి. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలి. భూగర్భ జలాలను పెంపొందించుకోవాలి. లేకుంటే భూగర్భ జలాలు అడగంటి పోతుంటాయి. నగరానికి మంచినీరు గోదావరి కృష్ణా నదుల నుంచి అధిక వ్యయప్రయాసలతో తెస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా తాత్కాలిక ప్రయోజనాలు ఇచ్చేవే. శాశ్వతంగా ఈ సమస్య నుంచి మనం బయటపడాలంటే ప్రతి ఒక్కరూ వాన నీటిని సంరక్షించుకోవాల్సి ఉంది. ఎవరికి వారు తమ ఇంటి విస్తీర్ణానికి అనుగుణంగా ఇంకుడు గుంతలు
నిర్మించుకుంటే వర్షపు నీరంతా భూమిలోకి చేరుతుంది. ఆ నీరే మనకు వర్షభావ పరిస్థితుల్లో ప్రాణాధార మవుతుంది. ఇంటి నిర్మాణం కోసం లక్షలాది రూపాయలను వ్యయం చేస్తున్న వారు తప్పనిసరిగా ఇంకుడు గుంతను నిర్మించుకుంటే భూగర్భ జలాలలకు ఢోకా ఉండదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పర్యావరణాన్ని కూడా రక్షించుకోగలం. ఈ పరిస్థితిని గమనించి జలమండలి ఇంకుడు గుంతల నిర్మాణానన్ని తప్పినిసరి చేసింది. వచ్చే జూన్ నాటికి వర్షాలు పడేలోపు ఇంకుడు గుంతలతో నీటిని ఒడిసి పడుతామంటూ హైదరాబాద్ జలమండలి ప్రజల్లో అవగాహనా చర్యలను విస్తృతం చేసింది. 14 స్వచ్ఛంద సంస్థల సహకారంతో నగరంలోని అన్ని మూలల్లో రెండునెలలుగా ప్రచారం జరుగుతున్నది. ఇంటింటికి నీటి సంరక్షణ చర్యలు చేపట్టినప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. అందుకే గ్రాండ్ ఫాదర్‌తో గ్రాండ్ చిల్డన్స్ర్ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేసే ఆలోచనతో జలమండలి ఉంది. నీటి రీచార్జ్‌కు సంబంధించి అపార్ట్‌మెంటు లేదా సొంతిల్లు ఉన్నవారు తప్పనిసరిగా ఇంకుడుగుంతను నిర్మించు కోవాల్సిందే. నగరంలో అడుగంటిపోతున్న భూగర్భ జలాన్ని పెంపొందించేందుకు జలమండలి ఇంకుడుగుంతలను నిర్మించుకునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నది. జలం జీవం కార్యక్రమంలో భాగంగా ఓఆర్‌ఆర్ వరకు కాలనీలు, విద్యాసంస్థల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా ఎన్జీవోల సహాకారంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇంకుడుగుంతల నిర్మాణానికి అవసరమైన వారికి సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నది. 200 చదరపు గజాల స్థలంలో భవనం నిర్మిస్తే ఇంకుడుగుంతలు నిర్మించు కోవడం తప్పనిసరి చేసింది. దీనిని ఉల్లంఘించిన వారు నీటి కోసం ట్యాంకర్ బుక్ చేస్తే దానికి అదనపు రుసుం వసూలు చేస్తారు. జలం జీవం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇప్పటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకున్న వినియోగదారులు తమ ఇంకుడుగుంత ఫొటోలను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నిర్మించిన జలాశయాలు నేటికీ మంచినీటిని అందిస్తున్నాయి. వాటితో పాటు చెరువులను కాపాడుకుంటూ భూగర్భ జలాలను పెంచుకోవడం పౌరుల కనీస బాధ్యతని గుర్తించాలి.