భూసర్వే ఆపండి
– భట్టి
హైదరాబాద్,ఆగష్టు 29(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 39 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్‌ఎస్ నేతలతో రైతు, సమన్వయ సమితిలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ జీవోను విడుదల చేసిందని ఆయన ఆరోపించారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ జీవో-39తో రాష్ట్రంలో భూ మాఫియాను తయారు చేయబోతున్నారని తెలిపారు. చట్ట వ్యతిరేకమైన జీవో 39ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కోర్టులో సవాలు చేస్తామని వెల్లడించారు. మళ్లీ బాంచన్ దొర వ్యవస్థను తీసుకురావాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమితి ద్వారా నిజమైన భూ హక్కు దారులకు అన్యాయం జరగనుందని మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. ఈ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రైతుల హక్కులను టీఆర్‌ఎస్ నేతల చేతుల్లో పెట్టాలన్న కుట్ర జరుగుతోందని తెలిపారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల ద్వారా చేయాల్సిన పనిని టీఆర్‌ఎస్ నేతలకు అప్పగించడం ఎందుకని భట్టి ప్రశ్నించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖలపై కేసీఆర్ కు నమ్మకం లేదా నిలదీశారు. భూముల వివాదాలను నామినేటెడ్ సభ్యులు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వ్యవస్థలను కూల్చవద్దని, ఇది ప్రమాదకర సంకేతమని ఆయన సర్కారును హెచ్చరించారు. .టీఆర్‌ఎస్ నేతలను న్యాయ వ్యవస్థగా మార్చాలని చూస్తున్నారని, అయితే ఇది తగదని భట్టి విక్రమార్క హితవు పలికారు.