భూ సమగ్ర సర్వేపై అసెంబ్లీని సమావేశపరచాలి-షబ్బీర్ అలీ
హైదరాబాద్,ఆగస్టు28 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న భూ సమగ్ర సర్వేపై సీఎం కేసీఆర్ కేవలం టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. భూ సర్వే పై ఆల్ పార్టీ విూటింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ విూడియా పాయింట్ లో మాట్లాడుతూ భూ సమగ్ర సర్వేలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. సర్వేపై అసెంబ్లీని సమావేశపరిచి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. మొదట హడావిడి చేయడం తర్వాత మూలన పడేయటం కేసీఆర్ కు అలవాటైందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ అవగాహన లేకుండా పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక కేసీఆర్ చెబుతున్న సర్వేలపై నమ్మకం లేదు. గతంలో సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎందుకు బయట పెట్టడంలేదని షబ్బీర్ అలీ నిలదీశారు. తక్షణమే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బయటపెట్టాలన్నారు.
గోడ దూకుతారనే అనుమానం
టీఆర్‌ఎస్ నుంచి జంప్ జిలానీల ఉన్నారన్న వార్తలతోనే కేసీఆర్ అందరికీ టికెట్లు ఇస్తానంటున్నారని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకుతారనే కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో 90శాతం మంది సిట్టింగ్ లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వరని షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నది డూప్లికేట్ టీఆర్‌ఎస్ పాలన అని షబ్బీర్ అలీ విమర్శించారు. కేసీఆర్ కు గెలుస్తామన్న దమ్ముంటే విూ పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీ ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించాలని సూచించారు. అప్పుడు వంద గెలుస్తారో లేక ఒకటి గెలుస్తారో తెలుస్తుందన్నారు.
టీఆర్‌ఎస్ నేతలతో భూ సర్వే-పొంగలేటి
టీఆర్‌ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ భూ సమగ్ర సర్వే చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. .తెలంగాణ రైతు సంఘాలను టీఆర్‌ఎస్ రైతు సంఘాలుగా చెయ్యాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ భూసర్వేతో కేసీఆర్ రైతులపై మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. సర్వేతో నామినేటెడ్ కమిటీలను వేయాలన్న కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇక డిజిటల్ సర్వే కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఎటు పోయాయని పొంగులేటి ప్రశ్నించారు.