భైరవానితిప్ప ప్రాజెక్టుకు పెరిగిన వరద
అనంతపురం,ఆగస్ట్3( జనం సాక్షి): వేదవతి నది పరీవాహక ప్రాంతం కర్నాటక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భైరవానితిప్ప ప్రాజెక్టు రిజర్వాయర్‌కు నీటిమట్టం 1649.6 అడుగులకు చేరింది. కాగా గరిష్ట నీటిమట్టం 1655 అడుగులుగా నమోదయ్యింది. బిటి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. కర్నాటక రాష్ట్రంలో గత
కొద్దిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న భైరవాని తిప్ప ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్లకి 2,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందని నీటి పారుదల శాఖ ఇంజనీర్ సాయిరాం తెలిపారు. మంగళవారం నాటికి రిజర్వాయర్లో ఒక టిఎంసి నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 1.25 టిఎంసి నీరు ఉందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 1655 అడుగులు కాగా ప్రస్తుతం 1649.6 అడుగులు నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ లోకి నీటి ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే మరో మూడు నాలుగు రోజుల్లో రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండే అవకాశం ఉందని తెలిపారు.