మంగుళూరు ఆందోళన ఉద్రిక్తం

యడ్యూరప్ప తదితరుల అరెస్ట్‌

బెంగళూరు,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి): మంగళూరులో బిజెపి చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పాటు అనుమతి లేకుండా ఆందోళనకు దిగినిందుకు గాను మజీ సిఎం, కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను పోలీసులు అరెస్ట్‌ చేశారు. యడ్యూరప్ప సహా పలువురు నేతల్ని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. కర్ణాటకలో ఇప్పటివరకు 24 మంది హిందూ సంస్థల కార్యకర్తలు హతమయ్యారని, దక్షిణ కన్నడ జిల్లాల్లో సంభవించిన ఈ హత్యలకు ఇంఛార్జి మంత్రి రమానాథరై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఈ ఆందోళన చేపట్టింది. దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో సంఘ్‌పరివార్‌ కార్యకర్తలపై దాడులకు నిరసనగా కర్ణాటకలోని మంగళూరులో చేపట్టిన ఛలో మంగళూరు ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. మంగళూరులోని నెహ్రూ మైదాన్‌ వరకు చేపట్టిన ఈ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో జ్యోతి సర్కిల్‌ వద్ద భాజపా కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించినప్పటికీ ముందుకెళ్లాలని భాజపా నిర్ణయించింది. ఆ దిశగా కార్యకర్తలు మంగళూరు వీధుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ వారిని ముందుకు కదలనివ్వలేదు.