మంగోలియాతో మనబంధం బలమైనది : ప్రధాని నరేంద్ర మోదీ

4

మంగోలియా, మే 17(జనంసాక్షి) : మంగోలియాతో భారత బంధం బలమైందని భారత ప్రధాని మోదీ అన్నారు. చైనా పర్యటన ముగించుకుని రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగోలియాకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఆసియాలో, శాంతి, స్థిరత్వం అభివృద్ధి కోసం మంగోలియాతో కలిసి పని చేస్తామని ఆయన ప్రకటించారు. మానవ సంబంధాలతోనే ఆర్థిక సంబంధాలు బలంగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంగోలియాలో పర్యటించడం చాలా సంతోషంగా ఉందని, మంగోలియాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కోసం ఐదు దశాబ్దాల క్రితం మంగోలియాకు మద్దతు పలికినట్లు మోదీ చెప్పారు. రెండు దేశాల ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త పుంతలు తొక్కిద్దామని ఆయన పిలుపు ఇచ్చారు. మంగోలియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా మంగోలియా ప్రధాని చిమెద్‌ సాయిఖన్‌ బిలెగ్‌తో సమావేశమైన ఆయన షిప్పింగ్‌, రవాణా, రహదారులు, విద్యుత్‌ అభివృద్ధి, ఇరువైపులా పన్నుల విధానం వంటి తదితర అంశాలపై చర్చించారు.

బౌద్ధ ఆలయాన్ని సందర్శించిన మోదీ

మంగోలియా పర్యటనలో భారత ప్రధాని అక్కడ బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ఆలయ పూజారికి బోధి వృక్షాన్ని కానుకగా ఇచ్చారు. అంతకుముందు ఆయనకు రాజధాని ఉలన్‌ బాటర్‌లో అధికారిక స్వాగతం లభించింది. చైనాలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న మోదీ నిన్న (శనివారం) సాయంత్రం మంగోలియా రాజధాని ఉలన్‌ బాట చేరుకున్నారు. అక్కడి రాజభవన్‌ దగ్గర మోదీకి సాంప్రదాయ స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అనంతరం మోదీ రాజభవన్‌ను సందర్శించారు. అక్కడ ఆయన విజిటర్స్‌ పుస్తకంలో ఆటోగ్రాఫ్‌ చేశారు. చైనాలోనూ బౌద్ధ ఆలయాన్ని సందర్శించిన మోదీ మంగోలియాలోని ఉలన్‌ బాటలో ఓ పురాతన బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన బౌద్ధ సన్యాసులతో కొద్దిసేపు గడిపారు. మోదీ రాక సందర్భంగా బౌద్ధ పూజారులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతోపాటు మోదీ మినీ నాదం వేడుకను ప్రారంభించారు. మంగోలియా ప్రధాని కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు. ప్రతి ఏడాది మే నెలలో మంగోలియన్లు సంప్రదాయ నాదం ఉత్సవాలు జరుపుకుంటారు. ఆ ఉత్సవాల్లో గ్రావిూణ క్రీడలు నిర్వహిస్తారు. వేడుకలు సందర్భంగా మోదీ విల్లును చేపట్టి బాణాలు వదిలారు.