మంచినీటి సరఫరాకు కసరత్తు

జంటజలాశయాలు నిండితేనే సాకారం

హైదరాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): నగరంలో ప్రణాళికాబద్ధమైన నీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందిస్తున్నా, జలాశయాల్లో నీరు రాకపోవడం నిరాశ కలిగిస్తోంది. జంటజలాశయాలకు తోడు గోదావరనీరు కూడా అంతంతమాత్రంగానే అందుతోంది. దీనికితోడు మిషన్‌ భగీరథ కింద పనులు పూర్తయితే నిరంతర నీటి సరఫరాకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌ ఆదేశాల మేరకు త్వరలోనే రోజూ నీటి సరఫరా చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు గంటన్నర నుంచి రెండున్నర గంటల పాటు నీటి సరఫరా చేస్తున్నారు. నిత్యం నీటి సరఫరాలో కూడా గంట నుంచి రెండు గంటలపాటు నీటి ని వదులుతారు. 200 మురికివాడల్లోని 50 వేల కుటుంబాలకు రోజూ నీటి సరఫరా ద్వారా తాగునీరందించాలన్నది అధికారుల ఆలోచన. దీనికి సంబంధించిన పనులను దశల వారీగా అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నీటి వృథా కాకుండా.. కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేసేలా.. పౌరుల అవసరాలకు సరిపడా నీటిని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో పైపుల లీకేజీలపై దృష్టి పెట్టారు. నిరంతర నీటి సరఫరా చేయాలంటే లీకేజీలు లేని సరఫరా నెట్‌వర్క్‌తోపాటు.. అదే స్థాయిలో డ్రైనేజీ పైపులైన్‌ వ్యవస్థ ఉండాలి. లేని పక్షంలో మురుగు సమస్య మరింత పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని పనులు చేస్తున్నారు. మార్చి నుంచి వీలైనన్ని ప్రాంతాల్లో నిత్య నీటి సరఫరా ప్రారంభిస్తామని బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిషోర్‌ తెలిపారు. గత సంవత్సరం వేసవికి ముందే జంట జలాశయాలు, సింగూరు, మంజీరాల నుంచి నీటి రాక గణనీయంగా తగ్గింది. మార్చి, ఏప్రిల్‌ నాటికి పూర్తిగా నిలిచిపోయింది. అదే సమయంలో కృష్ణా మూడో దశ, గోదావరి నీళ్లు అందుబాటులోకి రావడంతో నగరం దాహార్తి తీరింది. ప్రస్తుతం జంట జలాశయాలతోపాటు, సింగూరు, మంజీరా నదుల్లోకి నీరుచేరాల్సి ఉంది. అయినా భవిష్యత అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా వనరుల నుంచి నిర్ణీత స్థాయి కంటే తక్కువ నీటిని డ్రా చేస్తున్నారు.