మంచినీటి సేవనం ఆరోగ్య సూత్రం
మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా ‘మధ్యేమధ్యే పానీయం సమర్పయామి’ అంటున్నాం. ఎలాంటి జలం అంటే, ‘శుద్ధాచమనీయం’ అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా ‘శుద్ధోదకం’ అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని ‘గీత’లో పరమాత్మ చెప్పాడు.భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం.