మంచిర్యాలలో పోటీ చేసి తీరుతామంటున్న సీపీఐ
ఆదిలాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రెండు సీట్లు కోరిన సీపీఐ మంచిర్యాల సీటుపై పట్టుపడుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ కోసం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ మంచిర్యాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తేలడంతో స్థానిక సీపీఐ, దాని అనుబంధ సంఘం ఏఐటీయూసీ నాయకులు అల్టిమేటం ఇచ్చారు. మహాకూటమి నుంచి సీపీఐకి మంచిర్యాల కేటాయించాలని కోరుతున్నామని, పొత్తులో సీటివ్వకపోయినా, సీపీఐ అభ్యర్థిని పోటీలో నిలుపుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ, మహాకూటమిలో సీట్ల కోసం పోటీ ¬రా¬రీగా సాగుతోంది. ఇకపోతే ఉమ్మడి ఆదిలాబాద్‌లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి రెండు సీట్లను టీజేఎస్ కోరుతోంది. కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల కావడంతో ఇక్కడినుంచి ఆయన పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా, స్పష్టత లేదు. కోదండరాం పోటీ చేయకపోతే చెన్నూరు నుంచి దుర్గం నరేష్‌ను మహాకూటమి తరుపున బరిలో దింపాలని యోచిస్తున్నారు.