మంచుకురిసే అవకాశం ఉన్నందునే ముందే ఎన్నికలు

– చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అచల్‌ కుమార్‌ జ్యోతి
న్యూఢిల్లీ, అక్టోబర్‌23(జ‌నంసాక్షి) : గుజరాత్‌ కంటే ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు నిర్వహించడంపై స్పందించారు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అచల్‌ కుమార్‌ జ్యోతి. వాతావరణంతోపాటు చాలా కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నవంబర్‌లో మంచు కురిసే అవకాశం ఉండటంతో రెండోవారం లోపే ఎన్నికలు నిర్వహించాలని హిమాచల్‌ ప్రదేశ్‌లోని అన్ని పార్టీలు కోరాయని సీఈసీ తెలిపారు. అయితే ఈ హిమాచల్‌ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌ ప్రభావం చూపకుండా ఆ రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టంచేశారు. అందుకే కౌంటింగ్‌ తేదీని డిసెంబర్‌ 18గా నిర్ణయించామని చెప్పారు. ఇక హిమాచల్‌, గుజరాత్‌ పక్కపక్క రాష్టాల్రు కాకపోవడం కూడా ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమని ఏకే జ్యోతి తెలిపారు. పక్కపక్క రాష్టాల్రైతే ఒక రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ మరో రాష్ట్రంపై ప్రభావం చూపిస్తుందని, గుజరాత్‌ విషయంలో ఆ పరిస్థితి లేదని ఆయన చెప్పారు. ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరో రాష్ట్రంపై పడకుండా తాము ఎప్పుడూ జాగ్రత్త పడతామని సీఈసీ అన్నారు. ఈ మధ్యే గుజరాత్‌లో భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రం పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏకే జ్యోతి వెల్లడించారు.