మండతున్న ఎండలు!… ఉరుముతున్న మేఘాలు!

రాష్ట్రంలో అసాధారణ వాతావరణం
విశాఖపట్నం :ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉరుముతున్న మేఘాలు, ఇటుఉక్కపోత! అటు కుండపోత! ఈ వైపు మాడు పగిలే ఎండతో సతమతం! ఆవైపు తడిసి ముద్దయిన జనం! రాష్ట్రంలో ప్రస్తుతం అసాధారణ వాతావరణం పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రాంతంలో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు, వడగళ్లు కురవగా… రాయలసీమ, కోస్తాల్లో మంగళవారం భానుడు చండ ప్రచండంగా మండిపోయాడు.
మంగళవారం మెదక్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షనికి పెద్దస్థాయిలో పంట, ఆస్తి నష్టం వాటిపల్లింది. హైదరాబాద్‌లో జడివాన కురిసింది. అదే సమయంలో కోస్తా, రాయలసీమలలో ఉష్టోగ్రతలు అనేక చోట్ల సాధారణంకంటే ఒకటిరెండు ఎక్కువగానే నమోదయ్యాయి. అనంతపురంలో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఏమిటి కారణం…
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా మారుమూల కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి (హీట్‌ట్రఫ్‌) బలపడింది. రెండు కిలోమీటర్ల ఎత్తులో ఈ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దక్షిణ కోస్తా, తమిళనాడు మీదుగా తేమగాలులు ద్రోణి దిశగా వీచాయి. ఇదే సమయంలో రాజస్థాన్‌ నుంచి పొడిగాలులు వచ్చాయి. రెండు వైపుల నుంచి వచ్చే గాలులు ద్రోణివద్ద కలిశాయి. అక్కడే దట్టమైన మేఘాల పుంజ (క్యుములో నింబస్‌ మేఘాలు) తయారయ్యాయి. తొమ్మిది నుంచి 12 కిలోమీటర్ల ఎత్తువరకు ఇవి వ్యాపించాయి, అక్కడ నుంచి క్యుములో నింబస్‌ మేఘాలు విచ్ఛిన్న కావడంతో వడగండ్లు పడ్డాయి.
ఇలాంటి సమయంలో ఈదురు గాలులు, మెరుపులు సంభవిస్తాయి. అల్పపీడన ద్రోణి బలపడటం వల్లే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ నిపుణుడు ఆర్‌.మురళీకృష్ట విశ్లేషించారు. వేడి వాతావరణం పెరిగేకొద్దీ అంటే ఏప్రిల్‌ మూడో వారం నుంచి ‘ప్రీమాన్‌సూన్‌ థండర్‌ స్టార్మ్స్‌’ ప్రారంభం కావడం సహజమే. ఈసారి మార్చి నెలాఖరు నుంచే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ఏప్రిల్‌ తొలినాళ్లలోనే ‘థండర్‌ స్టార్మ్స్‌’ కనిపిస్తున్నాయి.
వారం ముందుగా నైరుతి?
ఈ సంవత్సరం వేసవి ముందుకు జరిగినట్లుగానే… వర్షాలను మోసుకోచ్చే నైరుతి రుతుపవనాలు కూడా వారం ముందే పలకరించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా నైరుతి రుతు పవనాలు జూన్‌ ఒకటిన కేరళను తాకుతాయి. వాతావరణంలో సంభవిస్తున్న అసాధారణ మార్చుల ప్రభావం రుతుపవనాల ఆగమనంపై కనిపిస్తుందని ఆంధ్ర విశ్వఇవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగాధిపతి ఆచార్య ఎస్‌ఎస్‌వీఎస్‌ రామకృష్ట తెలిపారు.
”మే నెలలో ఉండాల్సిన వేడి మార్చిలోనే కనిపించింది. ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతను మరింత పెరుగుతాయి. ఇదే వేడి వాతావరణం ఏప్రిల్‌ చివర వరకు కొనసాగితే రుతుపవనాలు వారం ముందుగానే దేశంలోనే దేశంలోకి ప్రవేశించవచ్చు” అని ఆయన అంచనా వేశారు. ఉత్తర. దక్షిణ ధ్రువంలో ఉష్ణోగ్రతలు పెరిగాయని ఆయన విశ్లేషించారు. ఇప్పటికే 120 రోజులుండే నైరుతి రుతుపవనాల సీజన్‌ పరిధి పెరిగిందని గుర్తుచేశారు. ఒకవేళ ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా ఉంటే మాత్రం రుతుపనాలు యథావిధిగానే వస్తాయని రామకృష్ట తెలిపారు.