మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన సిఎం యోగి

లక్నో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా డిప్యూటీ సీఎంలు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, దినేష్‌ శర్మతోపాటు మంత్రులు స్వతంత్రదేవ్‌ సింగ్‌, మోహసిన్‌ రజాకు పోటీగా వేరెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రదీప్‌ దూబే శుక్రవారం ప్రకటించారు.శాసన మండలికి జరుగుతున్న ఉప ఎన్నికలకు గాను వీరు మంగళవారం నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం వీరు మాత్రమే బరిలో మిగలటంతో ఈ మేరకు ప్రకటించినట్లు ఆయన వివరించారు. కాగా, మోహసిన్‌ రజా యూపీ మంత్రిమండలిలోని ఏకైక ముస్లిం మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికతో గోరఖ్‌పూర్‌ ఎంపి పదవికి యోగి రాజీనామాచేయనున్నారు.