– మండల కేంద్రంలో 7వ రోజు కి చేరిన రిలే నిరహార దీక్ష.

 ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 7వ రోజు కి చేరిన నిరవధిక రిలే నిరహార దీక్ష. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో గ్రామాలన్నీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా గోదావరి వరద ముంపు కి అనునిత్యం గురవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలి లేదా తెలంగాణలో గోదావరి పరివాహక ముంపు గ్రామాలకు మెరుగైన ప్యాకేజ్ 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సమగ్ర పరిహారం ఇవ్వాలని కోరుతూ దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలో అంబేద్కర్ కాలనీ నుండి పెద్ద సంఖ్యలో మహిళలు పురుషులు పాల్గొన్నారు. వీరికి మాజీ గ్రామ సర్పంచ్ జక్కం సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే కొంజా బిక్షం సతీమణి కుంజా వెంకటరమణ, కాంగ్రెస్ నాయకురాలు బోడా దివ్య లు దీక్షలో పాల్గొన్న మహిళలకు పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు. అనంతరం జక్కం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగి పోతున్నాయని, ఈ విషయం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసునని అయినను సమస్య పరిష్కారం దిశగా దృష్టి పెట్టకపోవడం విచారకరమని, తరతరాలుగా నివాసం ఉంటున్న ఊర్లు నేడు ముంపు కారణంగా ఖాళీ చేయాల్సిన దుస్థితి దాపరించిందన్నారు. తక్షణం ప్రభుత్వాలు సమన్వయంతో త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నామని, లేదంటే భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో దీటుగా సరైన సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం మండల అధ్యక్షుడు భత్తుల వెంకటేశ్వర్లు దీక్షకు సంఘీభావం తెలియజేశారు. కన్వీనర్ కె.వి రమణ మాట్లాడుతూ 29 ఆగష్టు న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గోనెల చిన్న సడలు, మహబూబ్, బర్ల రవి, ప్రధాన కార్యదర్శి దామర శ్రీనివాసరావు, బీసీ సంఘం జిల్లా నాయకులు మహంకాళి రామారావు, మహమ్మద్ మున్న,  పోలుకొండ ప్రభాకర్, బీసీ సంఘం మండల నాయకులు దాసరి సాంబ, బెల్లంకొండ అనిత, యస్ కె బాబా, కేసుపాక రవికుమార్, కేసుపాక సీతా రాంబాబు, తోకల ప్రవళిక,  శ్రీనివాస చారి, భవనం చందు, రాజేశ్వర్ రెడ్డి,  ముదిగొండ బాలకృష్ణ కుల మతాలకతీతంగా పెద్ద సంఖ్యలో ముస్లీం, హిందూ, క్రిష్టియన్ మహిళలు పాల్గొన్నారు.