మండుటెండలతో జనం బేజార్‌

రోడ్లపైకి రావద్దంటున్న వైద్యులు
కరీంనగర్‌,మే1(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో  ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపుతుండడంతో రోడ్లపైకి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోయాయి. సాయంత్రం వేళల్లో రోడ్లపై జనం కనిపిస్తున్నారు.  జిల్లాలో ఉస్ణోగ్రతలు 45డిగ్రీల వరకు నమోదయ్యాయి.  రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.జిల్లాలో ఎండ మండిపోతున్నది. భానుడి ఉగ్రరూపంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45డిగ్రీలు నమోదు కావడం ఆందోళన కలిగించింది. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడం గమనార్హం. ఉదయం 7నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతుండడంతో రోడ్లపైకి రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా రోడ్లన్నీ బోసిపోతున్నా యి. ముఖ్యమంగా మధ్యాహ్నం 1నుంచి 4దాకా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ప్రజలు గొడుగులు, నెత్తిన క్యాపులు, కర్చీఫ్‌లతో కనిపిస్తున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఎండతో ఇబ్బంది పడుతున్నారు. నీరసించి పోయి ఆనారోగ్యానికి గురవుతున్నారు. ఎండతో పాటు వడగాలులు వీస్తుండడంతో వడదెబ్బకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎండకు నీరసించిపోతున్నారు. వారం రోజులుగా జిల్లాలో 42 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉపాధి కూలీలు, ఇతర వ్యవసాయ కూలీలు తెల్లవారుజామునే పనుల్లోకి వెళ్లి పదిగంటల కల్లా తిరుగుముఖం పడుతున్నారు. గత రెండు రోజులుగా ఎండ తీవ్రతతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప.. మిగతా సమయాల్లో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులకు ఓఆర్‌ఎస్‌, మజ్జిగను, నీరు తాగాలని సూచిస్తున్నారు.ఎండ తీవ్రం కావడంతో వడదెబ్బకు గురయ్యే ప్ర మాదముందనీ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని వై ద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా మజ్జిగ, నిమ్మర సం, పల్లరసాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండలో తిరిగేటప్పుడు తలకు రుమాలు, టోపీలు ధరించాలనీ, గొడుగు పట్టుకెళ్లాలని సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం వడదెబ్బ లక్షణాలనీ, అలాంటివి కనిపిస్తే వెంటనే తగు జాగ్రత్తలు తీసుకని వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎండాకాలంలో టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, కడుపునొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలకు గురయ్యే ప్రమాదముందనీ, కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎక్కువగా బ యట తిరగకుండా ఉండాలని చెబుతున్నారు.