మంత్రి ప్రోద్బలంతో జనంసాక్షి జర్నలిస్టు అక్రమ నిర్బంధం

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని రేకుర్తి పరిధిలో గత నాలుగు నెలల క్రితం ముస్లిముల ఇండ్లను కూల్చివేసిన అంశాన్ని ‘జనంసాక్షి’ ప్రధాన సంచికలో అక్టోబర్‌ 18, 2023న ప్రచురితం చేయగా.. ఆ వార్తా కథనాన్ని రాసిన సదరు జర్నలిస్టును పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలను తుంగలో తొక్కిన మంత్రి గంగుల కమలాకర్‌… బుధవారం రోజున కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ సుబ్బారాయుడును ఈ విషయమై ఆదేశించారు. సీపీ సూచనలతో టూ టౌన్‌ సీఐ రాంచందర్‌ రావు తన సిబ్బందిని ఉదయం 9 గంటల ప్రాంతంలో జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి, సీనియర్‌ జర్నలిస్టు పీఎస్‌ రవీంద్ర ఇంటికి పంపి కారులో ఎక్కించుకుని వచ్చి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టడంతో బాధిత జర్నలిస్టును విడిచిపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది.టీయూడబ్ల్యూజె (ఐజేయు), టీడబ్ల్యూజేఎఫ్‌ జర్నలిస్టులు ఉదయం నుంచి రవీంద్రకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మేనేని రోహిత్‌రావు, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి, మైనార్టీ నాయకులు సమద్‌ భాయ్‌, తాజోద్దీన్‌, పలు సంఘాల నాయకులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని సంఫీుభావం ప్రకటించారు. భారీ సంఖ్యలో పీఎస్‌ రవీంద్రకు మద్దతుగా రావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయనను పోలీసులు విడిచిపెట్టారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్న జర్నలిస్టును అక్రమంగా నిర్బంధించడం, ఆయన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా దాదాపు ఐదుగంటల పాటు స్టేషన్‌లోనే ఉంచడం పట్ల జర్నలిస్టు యూనియన్లు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. దీనిపై గురువారం రోజున కలెక్టరేట్‌ను ముట్టడిరచి కలెక్టర్‌కు, సీపీకి వినతిపత్రం అందించేందుకు జర్నలిస్టులు సిద్ధమయ్యారు. ఎన్నికల కమిషన్‌ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.