మంథని నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్

జనంసాక్షి ,మంథని : మంథని నియోజకవర్గ అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ అభ్యర్థి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయగా 22న జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంథని నియోజక వర్గ అభివృద్ధికి సంబంధించిన వివరాలతో గురువారం రావాలని పుట్ట మధును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో గురువారం రాత్రి హైదరాబాదులోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా మంథని నియోజక వర్గంలోని కాటారం కేంద్రంగా మహదేవ పూర్, పలిమెల, మహా ముత్తారం, కాటారం, మల్హర్ మండలాలను కలుపుకొని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా కాటారం-పెద్దపల్లి ప్రధాన రహదారిని డబుల్ రోడ్డు గా తీర్చిదిద్దాలని, చిన్న కాలేశ్వరం, మంథని మండలం పోతారం ఎత్తి పోతల పథకాలను ఈ నెలలోగా పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. పుట్ట మధు వినతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. నేడో రేపో ముఖ్యమంత్రి కేసీఆర్ కాటారంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించనున్నట్లు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పీట్ల గోపాల్, ఇనగంటి రామారావు, యువ నాయకులు ఐలి విజయ భాస్కర్ లు వున్నారు.