మక్కా ప్రమాదంలో 107కు చేరిన మృతుల సంఖ్య

4

మదీనా,సెప్టెంబర్‌12(జనంసాక్షి):

సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కామసీదు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 107కి చేరింది. వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో క్షతగాత్రులు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది  భారతీయులు గాయపడినట్లు తమకు సమచార మందిందని విదేశీ వ్యవహరాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. మక్కా మసీదు వద్ద నిర్మాణ పనులు చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్‌ కుప్పకూలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. హజ్‌ యాత్ర ఏర్పాట్లలో ఈ భారీ విషాదం చోటు చేసుకుంది. ముస్లింలకు పరమ పవిత్ర క్షేత్రమైన మక్కాలోని మసీదు లో ప్రమాదంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగింది.  శుక్రవారం మక్కాలో వీచిన పెను గాలులకు… నిర్మాణ పనులకోసం ఏర్పాటు చేసిన భారీ క్రేన్‌ ఒకటి చిగురుటాకులా వణికి కూలిపోయింది. మసీదు పైభాగాన్ని చీల్చుకుంటూ నేలకొరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 87 మంది మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మరో 184 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దుర్ఘటన విషయాన్ని ధ్రువీకరించిన అధికార వర్గాలు… మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టలేదు. కొన్ని చానళ్లు ఈ ప్రమాద దృశ్యాలను చూపిస్తూనే… ‘చాలా మంది మరణించారు’ అని తెలిపాయి. తెల్లటి పాలరాయి పరిచిన మసీదులో రక్తసిక్త దేహాలు అనేకం చెల్లాచెదురుగా కనిపించాయి. క్రేన్‌ విరుచుకుపడటంతో మసీదు పైకప్పుకు పెద్ద రంధ్రం పడింది. క్రేన్‌ భాగాలు పైనుంచి కిందికి

వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో కనిపిస్తున్నాయి.  సహాయ సిబ్బంది, వైద్యులు హుటాహుటిన సంఘటన స్థలానికి తరలివెళ్లారు. ఈనెల 21వ తేదీ నుంచి హజ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్‌సహా అనేక దేశాలకు చెందిన వేలాదిమంది ముస్లింలు దీనికోసం సౌదీ చేరుకున్నారు. లక్షల సంఖ్యలో వచ్చే యాత్రికుల కోసం సౌదీ ప్రభుత్వం భారీస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఏకకాలంలో 22 లక్షల మంది ప్రార్థనలు చేసేందుకు వీలుగా మసీదు విస్తీర్ణాన్ని 4 లక్షల చదరపు విూటర్లకు విస్తరిస్తోంది. దీనికోసం కొన్నాళ్లుగా భారీ స్థాయిలో నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో నిర్మాణ క్రేన్లను ఏర్పాటు చేసి పనులు సాగిస్తున్నారు. ఇప్పటికే సౌదీ చేరుకున్న యాత్రికులు… శుక్రవారం ప్రార్థనల కోసం పెద్దసంఖ్యలో మక్కా మసీదుకు చేరుకున్నారు. ఈ సమయంలోనే పెను ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల్లోనూ ఎక్కువ మంది హజ్‌ యాత్రికులేనని తెలుస్తోంది. సౌదీలోని మక్కా మసీదు ప్రమాద మృతులకు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీలు నివాళులర్పించారు. మక్కా మసీదులో క్రేన్‌ కూలిన ఘటనలో 107 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతులకు నివాళులర్పిస్తున్నట్లు  ట్విట్టర్‌లో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది భారతీయులు గాయపడినట్లు సమాచారం.