మట్టితో రోడ్డు నిర్మాణంపై స్థానికుల నిరసన

 

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : నగరంలోని రహదారులకు మహర్దశ పట్టించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నింటే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనబడుతోంది. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పూడ్చేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది డాంబర్‌కు బదులుగా మట్టితో పూడ్చడం చర్చనీయాంశంగా మారింది. ఎల్బీనగర్‌ చింతలకుంట చెక్‌పోస్టు వద్ద గుంతలను పూడ్చడంలో అక్రమాలు

జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారిపై డాంబర్‌కు బదులుగా మట్టిపోసి గుంతల్ని పూడుస్తున్నారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మట్టి ఎందుకు పోస్తున్నారు అని ప్రశ్నిస్తే.. రెడీమిక్స్‌ పోస్తున్నామంటూ సిబ్బంది అవాస్తవాలు చెబుతున్నారు. రెడీమిక్స్‌లో సిమెంట్‌ లేదు కదా అంటే మట్టే సిమెంట్‌ అంటూ బుకాయింపు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకొని రోడ్ల నాణ్యతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.