మతాల మధ్యన మంటలు..
` ఎగేసుడే బీజేపీ వ్యూహం.. ఉద్రిక్తతలు సృష్టించడమే లక్ష్యం!
` రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది చట్టబద్ధమైన వాటా మాత్రమే
` అదనపు నిధులు కానీ, ప్రత్యేక పథకం కానీ లేవు
` తెలంగాణకు చేసిందేమిటో చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు
` అయినా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ
` ఓర్చుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్న బీజేపీ
` అందుకే మతపరమైన వ్యాఖ్యలతో ‘డైవర్షన్ రాజకీయాలు’
` అంతర్జాతీయంగా దీర్ఘకాలిక దుష్ప్రభావం చూపే మత రాజకీయాల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
` తెలంగాణ అభివృద్ధే ఎజెండాగా ముందుకు వస్తేనే ఏ పార్టీకైనా మనుగడ
హైదరాబాద్(జనంసాక్షి):ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడేనాటికి సాగునీటికే కాకుండా తాగునీటికి సైతం తహతహలాడిన ప్రాంతం తెలంగాణ. కనీసం గృహావసరాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితి ఆనాటిది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతుంది. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పటికీ ‘మిషన్ భగీరథ’ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతోంది. మిషన్ కాకతీయ, కాళేశ్వరం పథకాల ఫలితంగా సాగునీరు ఇబ్బందులు దూరం అవడమే కాదు ఎండాకాలంలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ‘రైతుబంధు’ విజయవంతంగా అమలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దళితులందరికీ ‘దళితబంధు’ అమలు సాధ్యం పట్ల కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అత్యంత వెనుకబడి ఉన్న దళిత కుటుంబాలలో మాత్రం విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలుకుతుంది. వ్యవసాయమే ప్రధానమైనప్పటికీ ఇక్కడి కులవృత్తులే తెలంగాణ జీవనవిధానానికి పునాది అని చెప్పుకోవచ్చు. తెలంగాణ తన సహజత్వాన్ని నిలుపుకోవాలంటే మరికొన్ని కులవృత్తులకు ప్రోత్సాహం లభించాలి. ఇప్పటికైతే గొల్ల కురుమ, బెస్త, ముదిరాజ్, చాకలి, మంగలి వంటి కులవృత్తి దారులకు భరోసా దొరికింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ‘తెలంగాణ అభివృద్ధి నివేదిక’ ఒక చిన్నపాటి గ్రంధమే అవుతుంది.ఇక అసలు విషయానికి వద్దాం.. పైన ఉదహరించిన ప్రతీ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందే. వీటిలో కేంద్ర ప్రభుత్వ సహకారం ఏ మాత్రమూ లేదు. కానీ రాష్ట్ర బీజేపీ విచిత్రంగా వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాలలో కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులు అందుకుంటుంది, రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం రాష్ట్రంలో అభివృద్దే జరగడం లేదు అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా బస్ చార్జీలు పెంచితే మాత్రం విచిత్రంగా రాష్ట్ర బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం కొనము అని తెగేసి చెప్పిన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనము అని ప్రకటించగానే రాష్ట్ర బీజేపీ ధర్నాలకు దిగుతుంది. నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, తెలంగాణ అప్పుల కుప్పగా మారిందంటూ రాష్ట్ర బీజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రెండు, మూడు లక్షల కోట్లు ఇచ్చామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు బాహాటంగానే చెప్తుంటారు. అందులో తెలంగాణ పన్నుల వాటాకు మించి ఇచ్చిన నిధులు ఎన్ని అని రాష్ట్ర మంత్రులు ప్రశ్నిస్తే మాత్రం సమాధానం ఉండదు. వీటన్నిటినీ గమనిస్తే బీజేపీకి కావాల్సింది తెలంగాణ అభివృద్ధి కాదు, వారికి కావాల్సింది కేవలం రాజకీయ లబ్ది మాత్రమే అనిపిస్తుంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సృష్టిస్తున్న అడ్డంకులను తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. తమను తెలంగాణ ప్రజలు నిలదీసే సమయం వచ్చిందని గ్రహించిన బీజేపీ రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకొని అమలు చేస్తుంది. గతంలో కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ముందు బీజేపీ ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించిందో యావత్ దేశం చూసింది. ఎన్నికలు ముగియగానే సాధారణ పరిస్థితులు నెలకొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. మతపరమైన భావోద్వేగాలతో రాష్ట్రంలో ఉద్రిక్తత వాతావరణం సృష్టించి తద్వారా రాజకీయ లబ్ది పొందాలనే వ్యూహంతో బీజేపీ ‘డైవర్షన్ రాజకీయం’ చేస్తుంది. అంతర్జాతీయంగా దీర్ఘకాలిక దుష్ప్రభావం చూపే ప్రమాదకరమైన మత రాజకీయాల పట్ల మేధావులు, సామాజికవేత్తలు, పౌరసమాజం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో శతాబ్దాలుగా వర్ధిల్లుతున్న మతసామరస్యాన్ని ఏ కుట్రల కత్తులు దెబ్బతీయలేవు.