మద్యంతో పార్టీల ప్రలోభాలు
ఆరునెలల ముందునుంచే మద్యం సేకరణ
పోలింగ్‌కు రెండురోజుల ముందు నిషా
హైదరాబాద్,నవంబర్27 ( జనం సాక్షి ): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలన్నీ ఓటర్లకు మద్యం పంపిణీకి రంగం సిద్దం చేశాయి. మరో రెండు రోజులే మిగలడంతో మద్యంలో ముంచెత్తేలా ప్రణాళికలు సిద్దం చేశాయి. ఓటర్లను మందు నిషాలో ముంచెత్తడానికి గ్రామాలకు మద్యం సీసాలు చేరుకుంటున్నాయి. సీసాలు ఎక్కడ నిల్వ ఉన్నాయనే లీకులు ప్రత్యర్థులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలైన బీఆర్‌ఎస్ అభ్యర్థులు అధిక శాతం స్థానిక సంస్థల ప్రతినిధుల వద్దకు లిక్కర్ సీసాలు చేర్చారని అంటున్నారు. కుల సంఘాల సభ్యులకు మద్యం చేరవేసి
పంపిణీ చేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందు మేక, గొర్రెపోతులు అందించి ప్రతీ కుటుంబానికి మటన్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఓటర్లను ఖుషీ చేయడం తమకూ తప్పదనే ఆలోచనతో మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులూ మద్యం సరఫరను మొదలు పెట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు లిక్కర్ కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరింస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక మద్యం కొనుగోలు, తరలింపు, డంప్ చేయడం కష్టమవుతోందని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరు నెలల నుంచి
ప్రతినెలా లిక్కర్ కొనుగోలు చేసి సీక్రెట్గా డంప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో ఒక పార్టీ అభ్యర్థి రూ.18 కోట్ల మందు కొన్నట్లు తెలుస్తోంది. మిగతావారు రూ.10 కోట్ల విలువకు కాస్త అటుఇటుగా సేకరించి పెట్టుకున్నారు. ఏ ప్రాంత వైన్సులలో లిక్కర్ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని తెలుసుకునేందుకు రికార్డులు పరిశీలించారు. గడిచిన ఆరు నెలల సేల్స్ సమాచారాన్ని చూసి ఆశ్చర్య పోతున్నారు. ఆరు నెలల ముందు నుంచే మద్యం కొనుగోళ్లు చేసి సురక్షిత ప్రాంతాల్లో డంప్ చేశారని తెలుస్తోంది. ఎన్నికలకు ఒకటిరెండు రోజుల ముందుగా వీటిని పంపిణీ చేస్తారు.