మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

 

సిఎం బావమరిది కాంగ్రెస్‌లోకి జంప్‌

భోపాల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ బావమరిది సంజయ్‌ సింగ్‌ మాసానీ కాంగ్రెస్‌లో చేరారు. చౌహాన్‌ సతీమణి సాధనకు సంజయ్‌ సోదరుడు కావడంతో బీజేపీకి ఈ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కమల్‌ నాథ్‌ సమక్షంలో సంజయ్‌ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అవకాశం ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బాలాఘాట్‌ జిల్లాలోని వరసియోనీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే అక్కడి నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యే యోగేంద్ర నిర్మల్‌ను బీజేపీ నిలిపింది. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత సంజయ్‌ విలేకర్లతో మాట్లాడుతూ నేటి బీజేపీ వంశపారంపర్య పాలన సాగిస్తోందని, బంధుప్రీతికి ఆలవాల మైపోయిందని ఆరోపించారు. బీజేపీ నిలిపిన అభ్యర్థుల్లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలేనని చెప్పారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు.