మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి హఠాన్మరణం

 

గుండెపోటుతో మృతి చెందిన మాజీమంత్రి దేవీసింగ్‌ పటేల్‌

భోపాల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌లో బిజెపి అభ్యర్థి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. రాష్ట్ర మాజీ మంత్రి, రాజ్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి అయిన దేవి సింగ్‌ పటేల్‌ గుండెపోటుతో మృతి చెందారు. అతను గుండెపోటుకు గురవ్వడంతో బర్వానీ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉమాభారతి గతంలో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు దేవి సింగ్‌ ఆమె కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. మూడు వారాల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండగా బరిలో దిగాల్సిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పటేల్‌ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజార్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు, రాజ్‌పూర్‌ నుంచి ఓసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు కూడా రాజ్‌పూర్‌ నుంచి పోటీ చేయాల్సి ఉండగా ఇంతలోనే విషాదం జరిగింది. రాజ్‌పూర్‌లో కాంగ్రెస్‌ తరఫున బాల బచ్‌చాన్‌ పోటీలో ఉన్నారు. పటేల్‌ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బచ్‌చాన్‌పై ఓడిపోయారు. పటేల్‌ అంత్యక్రియలు బందర్‌కచ్‌ అనే గ్రామంలో జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబరు 28న పోలింగ్‌ జరగనుంది. దీంతో ఈ స్థానంలో పోలింగ్‌ వాయిదా పడే అవకాశం ఉంది.