మధ్యప్రదేశ్ పర్యటనలో హరీశ్‌తో సిఎం చౌహాన్(పిక్చర్స్)

 13-1449990744-harish4ఇండోర్/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం అమలును పరిశీలించేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. రెండ్రోజుల మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్‌రావు రెండోరోజైన శనివారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. భోపాల్‌లోని నర్మద వ్యాలీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎన్‌వీడీఏ) కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, విజయవంతంగా నడిపిస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమం వివరాలను చౌహాన్ మంత్రి హరీశ్‌రావును అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పైప్‌లైన్ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థపైనా సమావేశంలో చర్చించారు. సాగునీటిని విజయవంతంగా పైప్‌లైన్ల ద్వారా రైతులకు అందిస్తున్న తీరును తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. ఈ విషయంలో వారి అనుభవాల్ని తెలుసుకున్న మంత్రి ఈ వ్యవస్థలోని లాభనష్టాల గురించి వాకబు చేశారు. ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అదనపు కార్యదర్శులు రజనీశ్, రాధేశ్యాంలతోపాటు ఆరాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ నాలుగోదశ ప్రాజెక్టు, పునాస లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదటిరోజు పర్యటనలో భాగంగా మంత్రి హరీశ్‌రావు సందర్శించారు. ఇక్కడి ఆయకట్టుకు నీటిని పైప్‌లైన్ల ద్వారా అందిస్తున్న విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రెండు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఇంజినీర్లు, రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. వారి అనుభవాల్ని అడిగి తెలుసుకున్నారు.