మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం దాటని పోలింగ్

మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఉదయం నుంచే ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. తమిళనాడులో మధ్యాహ్నం రెండు గంటల వరకు 46.2 శాతం పోలింగ్ నమోదైంది. తమిళనాడులో 234 నియోజకవర్గాలుండగా.. 232 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. తంజావూరు, అరవకురిచ్చిలో ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ఆరోపణలు రావడంతో పోలింగ్ వాయిదా పడింది. మరోవైపు, కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు 46.4 శాతం పోలింగ్ నమోదైంది. పుదుచ్చెరీలోని 30 స్థానాలకు మధ్యాహ్నం ఒంటిగంట వరకు 53.19 శాతం పోలింగ్‌ రికార్డయ్యింది. తమిళనాడు సామలపురంలోని పల్లపాలయంలో కొత్తగా పెళ్లయిన ఓ యువతి పెళ్లి బట్టల్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షం ఉండటంతో పోలింగ్ సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని ఈసీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన అధికారి తెలిపారు. కాసేపట్లో దీనిపై నిర్ణయం రావచ్చన్నారు.