మధ్యాహ్న భోజనం కడుపులు మాడుస్తోంది
– రూ.123 కోట్లు పక్కదారి
– కాగ్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ 19 జూలై (జనంసాక్షి) :
ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనంలో 123.29 కోట్ల పక్కదారి పట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది. ఈ పథకం పౌష్టికాహార పథకంగా లేదని, విద్యార్థుల కడుపులు మాడ్చే పథకంగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ పథకం అమలు, కేటాయించిన నిధుల దుర్వినియోగంపై కాగ్ ఒక నివేదికను ఇచ్చింది. అందులో చిన్నారులకు నాణ్యతతో కూడిన భోజనం అందడంలేదని, విద్యార్థులకు వారి తల్లులతోనే వండించి పెట్టాలన్న వ్యవస్థ ఎక్కడా అమలు కావడం లేదని తెలిపింది. కాగ్ తనిఖీ చేసిన రాష్ట్రాల్లో ఈ పథకం కోసం కేటాయించిన రూ.123.29 కోట్లు పక్కదారి పట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో 120 పాఠశాలలను పరిశీలించగా 86 చోట్ల పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. ఢిల్లీలోని శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలను సేకరించి పరీక్షలు జరపగా.. నిబంధనలకు అనుగుణంగా 89 శాతం నాణ్యతా ప్రమాణాలు లేవని తెలియపరిచింది. ఒడిశాలోని 103 పాఠశాలల్లో తల్లులు వండించి పెట్టే వ్యవస్థ లేదని పేర్కొంది. చత్తీస్‌ఘడ్, మేఘాలయా, సిక్కిం, త్రిపుర, అండమాన్ రాష్ట్రాల్లో భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. కర్నాటక బల్లారి జిల్లాలోని రెండు తాలూకాల్లో 304 పాఠశాలల్లో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్నారని, అయితే నిర్దేశింపబడిన వాటికంటే 1.04 లక్షల కేజీల బియ్యం పక్కదారి పడుతున్నాయని కాగ్ వెల్లడించింది.