మన్నేపల్లిలో శివరాత్రి రోజు విష్ణుపూజ
గుంటూరు,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): శివరాత్రి రోజు పరమశివుడికి పూజలు జరగడం సహజం. కానీ బొల్లాపల్లి మండలం మన్నేపల్లిస్వామి ఆలయంలో తిరునాళ్ల, వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ప్రత్యేకత. ఇక్కడ శ్రీనివాసుడు విూసాలతో భక్తులకు దర్శనమిస్తాడు. స్వామిని కొలిచినవారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. శివరాత్రి సందర్భంగా గుడికి వచ్చే భక్తుల కోసం దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వినుకొండకు 46కి.విూ దూరంలో బొల్లాపల్లి మండలం రావులాపురం పంచాయతీ పరిధిలోని కొండపైన మన్నేపల్లి పేరుతో వేంకటేశ్వరస్వామి వెలిశాడని భక్తుల నమ్మకం. శ్రీమహావిష్ణువు శ్రీనివాసుని అవతారంలో కలియుగ వైకుంఠం తిరుమలకు చేరడానికి ముందుగా ఈ కొండకు వచ్చారని ప్రతీతి. శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా నుంచి వేలాదిగా భక్తుల తరలివస్తారు.
శ్రీనివాసుడితోపాటు లక్ష్మినరసింహస్వామి, ఆదిలక్ష్మీ అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి. అందుకే ఇది మన్నేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. వినుకొండ డిపో నుంచి నేరుగా దేవాలయం వరకు తిరునాళ్ల రోజు బస్సులు తిరుగుతాయి.