మన్సూరాబాద్‌లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమావేశాలు
టిఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న బిజెపి కార్యకర్తలు
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): మన్సూరాబాద్ డివిజన్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మంత్రి జగదీశ్ రెడ్డి ఉన్న ఇంటిని బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్లంతా డివిజన్ నుంచి వెళ్లిపోవాలంటూ బీజేపీ అభ్యర్థి కొప్పుల నరసింహారెడ్డి నిరసనకు దిగారు. మంత్రి జగదీశ్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మల్యే సుధీర్‌రెడ్డి తక్షణం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వేడుకున్నారు. చేతులెత్తి మొక్కుతూ.. దయచేసి డివిజన్ నుంచి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ కార్యకర్తలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అక్కడి నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెళ్లిపోయారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార సమయం ముగిసిన తరవాత ప్రచారమే కాదు.. ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదు.. అయితే విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మన్సూరాబాద్ కాలనీ వాసులతో రహస్యంగా సమావేశమవుతున్న విషయం బయటకు పొక్కింది. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ అభ్యర్థి కొప్పుల నర్సింహ రెడ్డి, కొందరు కార్యకర్తలతో కలసి మంత్రి ఉన్న ప్రాంతానికి తరలివెళ్లారు. బీజేపీ కార్యకర్తలు వచ్చారని తెలియడంతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెనుదిరిగారు. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయం ముగిశాక కోడ్ ఉల్లంఘించి ఎలా ప్రచారం చేస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
చేస్తామని వారు పేర్కొన్నారు.