మన ఆర్టీసీ లాభాలబాట పట్టాలి
– ప్రజలకు మరింత సేవలు అందించాలి
– నష్టాలపై లోతైన అధ్యయనం జరగాలి
– ఎజెండా రూపకల్పనకోసం అధికారులతో సీఎం భేటీ
– నేడు విస్త్రతస్థాయి సమావేశం
హైదరాబాద్,,జూన్ 16(జనంసాక్షి):ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించటంతో పాటు లాభాలు ఆర్జించే మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ అవలంబించాల్సిన బహుముఖ వ్యూహంపై రేపు (శుక్రవారం) విస్తృతస్థాయి సవిూక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో సమావేశం ఎజెండా రూపకల్పన కోసం పలువురు అధికారులతో సీఎం మాట్లాడారు. ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ జేవి రమణారావుతో పాటు పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.రోజుకు 90 లక్షల మంది ప్రయాణించే ఆర్టీసీ.. ఎందుకు నష్టాల్లో నడుస్తుందనే విషయంపై లోతుగా చర్చించాలన్నారు సీఎం కేసీఆర్. ఆర్టీసీ లాభాలు అందుకోవటానికి ఎలాంటి మార్గాలు అవలంభించాలనే దానిపై కూలంకషంగా చర్చ జరగాలన్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ కూడా ప్రైవేట్ బస్సులు లాభాలు ఆర్జిస్తుండగా.. ఆర్టీసీ ఎందుకు నష్టపోతుందనే కోణంలో ఆలోచించాలన్నారు. విస్తృతస్థాయి సమావేశంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో పాటు ఆర్టీసీ గుర్తింపు పొందిన యూనియన్ నాయకులు పాల్గొనాలని సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపటం లేదనే వాస్తవాన్ని గుర్తించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వాస్తవ దృక్పథంతో కార్యాచరణ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రవాణా సౌకర్యం మెరుగుపరచటంతో పాటు.. ఆదాయం పెంచుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయన్నారు. ఆర్టీసీ అధికారులు సృజనాత్మకంగా ఆలోచించి ముందుకు పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్టీసీలో కొత్తగా ఈడీ (ఫైనాన్స్) పోస్టును ఏర్పాటు చేయాలని చెప్పారు.కేవలం టికెట్ల ద్వారానే కాకుండా వాణిజ్య ప్రకటనలు, కొరియర్ సర్వీస్ లాంటి సేవల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సూచించారు. పెద్ద బస్సులనే కాకుండా నగరంలో వివిధ పాయింట్ల దగ్గర అవసరమైతే ఇంటి దగ్గరే ఆగే విధంగా పది పదిహేను మంది పట్టే వాహనాలను నడపాలని సూచించారు. తిరుపతి, షిర్డీ లాంటి పుణ్యక్షేత్రాలకు, పుష్కరాలకు, జాతరలకు, వివిధ దేవాలయాల్లో జరిగే బ్ర¬్మత్సవాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి దైవదర్శనం, వసతి తదితర విషయాల్లో ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.టూరిజం శాఖతో కూడా ఆర్టీసీ అనుసంధానం కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. బస్టాండ్లు, డిపోల్లో మౌలిక వసతుల కోసం ప్రజా ప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాల అభివృద్ది నిధులు వెచ్చించాలని కోరారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రజాప్రతినిధులు సహకారం అందించాలన్నారు. ఆర్టీసీ కార్మికుల భాగస్వామ్యం పెరిగేందుకు అవసరమైన వ్యూహం రూపొందించాలని చెప్పారు.నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని సీఎం కేసీఆర్ అన్నారు. వాటిని అర్థం చేసుకోకుండా రాజకీయ కారణాలతో సమ్మెలు చేయడం మంచిది కాదని సూచించారు. ఆర్టీసీని కాపాడటం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, హైదరాబాద్ బస్సులను జీహెచ్‌ఎంసీకి అనుసంధానం చేసిందని గుర్తు చేశారు. ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కార్మికులకు 44 శాతం ఫిట్ మెంట్ తో జీతాలు పెంచామన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా సమ్మెలు చేస్తే ప్రభుత్వం కూడా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.తరచూ సమ్మెలు చేయడం వల్ల నష్టాలు ఎక్కువవుతాయని సమావేశంలో పాల్గొన్న ఆర్టీసీ అధికారులు అన్నారు. నష్టాల్లో నడపడం కన్నా ఆర్టీసీని మూసేయడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. కార్మికులు సహకరిస్తేనే ఆర్టీసీని నడుపుతామని, లేకుంటే వదిలేద్దామన్న ప్రతిపాదన కూడా వచ్చింది.మరోవైపు, టీఎస్ ఆర్టీసీ తొలి ఎండీగా జేవీ రమణారావు నియమితులయ్యారు. సీఎం కేసీఆర్ సూచనతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. టీఎస్ ఆర్టీసీ తొలి ఎండీగా రమణారావు రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఇప్పటి వరకు ఆయన ఆర్టీసీ జేఎండీగా విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా రమణారావు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.




