మన చరిత్ర తెలియాలి..

4

అందుకే సిలబస్‌లో చేర్చాం: ఘంటా చక్రపాణి
హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి):

ప్రతి ఒక్కరికీ తెలంగాణ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని, అలా జరిగితేనే తెలంగాణ సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అన్నారు. ఇందుకోసమే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. తెలంగాణ భౌగోళికం తెలిస్తేనే ఉద్యోగులు ఈ ప్రాంత అభివృద్దికి పాటుపడగలరన్న విశ్వాసం వ్యక్తం చేశారు.  అంబేద్కర్‌ వర్సిటీలో ‘రిట్రైవింగ్‌ పీపుల్స్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ’ అంశంపై రెండు రోజులుగా నిర్వహించిన సదస్సు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ తెలంగాణ చరిత్ర తెలియడం కోసమే పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రను పొందుపరిచామని తెలిపారు. గత పాలకులు తెలంగాణ చరిత్రను నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లోకి తెలంగాణ చరిత్రపై అనేక పుస్తకాలు వస్తున్నాయని, వాటిలో తెలంగాణ చరిత్ర అంతా తప్పుల తడకగా ఉంటుందన్నారు. ఈ విధమైన పుస్తకాలతో నష్టం జరుగుతుందన్నారు. దీన్ని నివారించేందుకు అన్ని యూనివర్సిటీలు కలిసి తెలంగాణ చరిత్రపై పూర్తి స్థాయి పుస్తకాన్ని రచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజాం కాలం నాటి విద్యా, ఉపాధి సౌకర్యాలను ఆయన కొనియాడారు. నాడు నిజాం అవలంబించిన పద్ధతులు మరెక్కడా లేవన్నారు. ఢిల్లీ యూనినవర్సిటీ ప్రొఫెసర్‌ తిరుమాలి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పీడనకు గురైన బలహీన వర్గాలకు సొంత రాష్ట్రంలో న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్పత్తి, పంపిణీ సూత్రాల ఆధారంగా తెలంగాణ ఎకనావిూ నిర్మితం కావాలన్నారు. బడా వ్యాపారవేత్తల చేతిలో నుంచి మార్కెట్‌కు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధాకర్‌, చివరి నిజాం విూర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ మనవరాలు, నిజాం మ్యూజియం ట్రస్టీ షాహెబ్‌జాద్‌ రషీదున్నీస భేగం తదితరులు పాల్గొన్నారు.