మమత వైద్యురాలిపై హత్యాచార ఘటన..


ఆదివారం నాటికి పూర్తికాకపోతే కేసు సీబీఐకి..
` పోలీసులకు మమత డెడ్‌లైన్‌
కోల్‌కతా(జనంసాక్షి): జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలను కుదిపేస్తోంది. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలంటూ వైద్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తంచేశారు.ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు. వారం రోజుల్లో కేసును పరిష్కరించలేకపోతే సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ పోలీసులు దీదీ ఈ డెడ్‌లైన్‌ విధించారు.సీఎం మమతా బెనర్జీ సోమవారం మృతురాలి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ.. ‘’ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నట్లయితే వారందరినీ ఆదివారం లోగా అరెస్టు చేస్తాం. ఒకవేళ అప్పటిలోగా రాష్ట్ర పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తాం. ఈ కేసుపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని దీదీ వెల్లడిరచారు.ఇదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థపై విమర్శలు గుప్పించారు. ‘’సీబీఐ విజయాల రేటు చాలా తక్కువగా ఉంది. చోరీకి గురైన రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ నోబెల్‌ బహుమతి కేసును వాళ్లు ఇంకా పరిష్కరించలేదు’’ అని మమత దుయ్యబట్టారు. విద్యార్థులు కోరుకుంటే ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గతవారం కూడా సీఎం చెప్పిన సంగతి తెలిసిందే.మరోవైపు, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ దీనిపై మాట్లాడారు. ‘’ఒకరి కంటే ఎక్కువమంది ఈ నేరానికి పాల్పడటమో లేదా నిందితుడికి సహకరించి ఉంటారని మేం అనుమానిస్తున్నాం. దీనిపై దర్యాప్తు చేపట్టాం. హెల్ప్‌లైన్‌ నంబర్‌ను కూడా ప్రారంభించా. అనుమానితుల గురించి తెలిసిన వైద్య విద్యార్థులు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వొచ్చు’’ అని తెలిపారు.పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు ఆర్‌జీ కార్‌ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కళ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధచోట్ల గాయాలు కనిపించాయి. దీంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధరించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
హత్యాచారం చేసి నిందితుడు హాయిగా నిద్రపోయాడు..
కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలను పోలీసులు వెల్లడిరచారు. ఈ కేసులో నిందితుడి గురించి పోలీసులు వివరాలు తెలిపారు.కోల్‌కతాలోని ఆర్జీకార్‌ మెడికల్‌ కళాశాలలో నిందితుడు వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన అనంతరం తాను ఉండే ప్రాంతానికి తిరిగొచ్చి హాయిగా నిద్రపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఉదయం సాక్ష్యాలను చెరిపివేయడానికి తన దుస్తులపై ఉన్న రక్తపు మరకలను తుడిచిపెట్టేందుకు ఉతుక్కున్నాడని చెప్పారు. అయితే.. అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు.పౌర వాలంటీర్‌ అయిన నిందితుడికి ఈ ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని.. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం సిటీ పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌ మెడికల్‌ కళాశాలను రెండో రోజు పరిశీలించారు. నిరసనకు దిగిన వైద్యులతో సమావేశమయ్యారు. విచారణ పారదర్శకంగా జరుగుతోందని.. ఈ కేసులో ఎలాంటి వదంతులను వ్యాపింపజేయవద్దని కోరారు. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పటి వరకూ అలాంటి ఆధారాలు లభించలేదని.. బాధితురాలి తుది పోస్టుమార్టమ్‌ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. తమ దర్యాప్తులో లభించిన ఆధారాలతో నివేదికను పోల్చి చూడాల్సి ఉంటుందని వెల్లడిరచారు.ప్రాథమిక పోస్ట్‌మార్టమ్‌ నివేదిక ప్రకారం.. బాధితురాలి కళ్లు, నోరు, అంతర్గత అవయవాల నుంచి రక్తస్రావం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇతర భాగాల్లో కూడా గాయాలున్నట్లు తేలింది. అయితే.. వైద్యురాలిని మొదట హత్య చేసి.. ఆ తర్వాత నిందితుడు అత్యాచారానికి పాల్పడి ఉంటాడని మరో పోలీసు అధికారి వెల్లడిరచారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ పనిచేసిన సిబ్బందిని విచారించినట్లు.. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేపట్టినట్లు వివరించారు.
నిరసనకు దిగిన జూనియర్‌ డాక్టర్లతో చర్చలు చేపట్టామని.. వారి డిమాండ్‌ మేరకు ఓ పోలిస్‌ అధికారిపై చర్యలు తీసుకున్నట్లు పోలీసు కమిషనర్‌ వెల్లడిరచారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఎలాంటి విషయాలను దాచడం లేదని తెలిపారు. మరోవైపు జూనియర్‌ వైద్యులు తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకూ నిరసనను కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.నిందితుడు సంజయ్‌ రాయ్‌ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా.. తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలంటూ.. ఎదురుచెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడి ఫోన్‌ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం.ఈ ఘటన చోటుచేసుకునే ముందు మృతురాలి గురించి పలు విషయాలను తోటి సిబ్బంది తెలిపారు. గురువారం రాత్రి విధుల్లోకి వచ్చిన ఆమె.. ఒలింపిక్స్‌ పోటీలను వీక్షించినట్లు చెప్పారు. ఈ ఘటన చోటుచేసుకోవడానికి కొన్ని గంటల ముందు నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ఫైనల్‌ను ఆమె వీక్షించినట్లు తెలిపారు. తన తోటి సిబ్బందితో కలిసి డిన్నర్‌ చేసి.. ఆ తర్వాత తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు వివరించారు. ఆ తర్వాత ఆమె సెమినార్‌ హాల్‌లో చదువుకునేందుకు వెళ్లిపోయిందని పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆదివారం లోగా కోల్‌కతా పోలీసులు కేసును పరిష్కరించలేకపోతే.. దీన్ని సీబీఐకి అప్పగిస్తామన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న వేళ దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.