మమ్మల్ని గెలిపిస్తే కోతుల్ని పట్టేస్తాం! 

– హిమాచల్‌ వాసులకు భాజపా, కాంగ్రెస్‌ నేతల హావిూలు
హమిపూర్‌, నవంబర్‌4(జ‌నంసాక్షి) :  హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పుడిప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అంతేకాకుండా హావిూల జల్లులను కురిపిస్తున్నాయి. హిమాచల్‌ వాసులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కోతుల బెడద ఒకటి. గుంపులు గుంపులుగా సంచరించే కోతులు తమ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏకంగా 2వేల గ్రామాలకు ఈ కోతుల బెడద ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఎన్నికల అజెండాలో చేర్చాయి. తమ పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తే కోతుల నుంచి పంటలను రక్షిస్తామని హామిలిస్తున్నాయి. ఈ సందర్భంగా భాజపా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కోతుల సంతానం వృద్ధికాకుండా సరిగా శస్త్రచికిత్సలు నిర్వహించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, ఆ కార్యక్రమాన్ని ప్రభావవంతంగా చేయలేకపోయిందన్నారు. దీంతో క్రమంగా తగ్గాల్సిన కోతుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని
పేర్కొన్నారు. మేం అధికారంలోకి వస్తే పంటపొలాలకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకునేలా రైతుల్లో అవగాహన కల్పిస్తామని, ఈ సమస్య పట్టణాలకు విస్తరించకుండా చర్యలు తీసుకుంటాం’ అని హావిూ ఇచ్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్‌ సత్తి మాట్లాడుతూ.. కోతుల సంఖ్య నియంత్రణలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ప్రయోజనం లేకపోయిందని విమర్శించారు. దీనిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖేశ్‌ అగ్ని¬త్ర మాట్లాడుతూ.. స్టెరిలైజేషన్‌ క్యాంపెయిన్‌ను సమర్థంగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే సమస్య పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. 2015లో అధికారులు చేపట్టిన కోతుల లెక్కింపు గణాంకాల ప్రకారం ఒక్క సిమ్లా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఏకంగా 2,400 కోతులు ఉన్నాయి.