మయన్మార్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

దిల్లీ,,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి):తొలి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం మయన్మార్‌ చేరుకున్నారు. నైపితా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి అధ్యక్ష భవనంలో ఆయనకు ఆ దేశ సైనిక సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. మూడు రోజుల పాటు మోదీ మయన్మార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ నేత ఆంగ్‌ శాన్‌ సూచీతో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు.’ఈ పర్యటన వల్ల భారత్‌-మయన్మార్‌ మధ్య సత్సంబంధాల్లో నూతన అధ్యాయం మొదలవుతుంది. మా ప్రభుత్వాలు, వ్యాపార సంబంధాల్లో ఇరు దేశాల సంపూర్ణ సహకారం ఉంటుంది’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్‌ ఖాతాలో రాసుకొచ్చారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మయన్మార్‌ అధ్యక్షుడు తిన్‌ క్యాను కలిశారు. సరిహద్దు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక అంశాలు, పెట్టుబడులు తదితర విషయాల గురించి మోదీ అక్కడి నేతలతో చర్చించనున్నారు. చైనాలోని షామన్‌లో జరిగిన రెండు రోజుల బ్రిక్స్‌ దేశాల సదస్సు ముగించుకున్న అనంతరం మోదీ తన మయన్మార్‌ పర్యటన ప్రారంభించారు.