మయన్మార్‌ పర్యటన చారిత్రాత్మకం – మోదీ

 

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): మయన్మార్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం యాంగన్‌లోని ష్వెడగాన్‌ పగోడాను సందర్శించిన మోదీ.. అక్కడి ప్రాంగణంలో బోధి మొక్కను నాటారు. 2500ఏళ్ల నాటి చరిత్ర గత ఈ పగోడాను మయన్మార్‌ సాంస్కృతిక వారతస్వ సంపదగా పేర్కొంటారు. అనంతరం అక్కడి నుంచి కలిబరీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆంగ్‌శాన్‌ మ్యూజియమ్‌ను సందర్శించారు. మోదీ వెంట ఆ దేశ స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌శాన్‌ సూచీ కూడా ఉన్నారు. మొఘల్‌ వంశంలో చిట్టచివరి చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. చైనాలో బ్రిక్స్‌ దేశాల సదస్సును ముగించుకున్న అనంతరం మోదీ అక్కడి నుంచి మయన్మార్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం మోదీ మయన్మార్‌ రావడం ఇదే తొలిసారి. అంతకు ముందు 2014లో ఆసియాన్‌-భారత్‌ సదస్సు కోసం వచ్చినా అది ద్వైపాక్షిక పర్యటన కాదు. సెప్టెంబర్‌ 5న మయన్మార్‌ చేరుకున్న మోదీ… ఆ దేశాధ్యక్షుడు టిన్‌గ్యాతో చర్చలు జరిపారు. అనంతరం ఆంగ్‌శాన్‌ సూచీతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారంపై సూచీతో చర్చించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్‌ పర్యటన ముగిసింది. మూడు రోజుల పాటూ మయన్మార్‌ లో పర్యటించిన ఆయన.. పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చివరి రోజు మయన్మార్‌ స్టేన్‌ కౌన్సెలర్‌ ఆగ్‌ సాన సూకీతో కలిసి యాంగోన్‌ లోని బోగ్‌ యోకే ఆంగ్‌ సాన్‌ మ్యూజియంను సందర్శించారు. అనంతరం యాంగోన్‌ ఏయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరారు.