మరింత అభివృద్ది కోసం ఎమ్మెల్యేగా గెలిపించాలి

గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్న సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి తనకు జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రచారంలో జోరు పెంచారు. ప్రబుత్వం చేసిన పనులను వివరిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు చెబుతున్న సమస్యలపైనా హావిూలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో ఓటమి పాలయ్యనని అప్పటి నుంచి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సహకారంతో ఎల్లవేలలా ప్రజలకు అందుబాటులో ఉంటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. ఈ సారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే గ్రామాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాన్నారు. అన్ని వర్గాల సంక్షేమే కేసీఆర్‌ ధ్యేయమని జగిత్యాల డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొంటున్నారు. గ్రామాల్లో నాయకులు ఘన స్వాగతాలు పలికి ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. గత పాలకులు రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కష్టాల్లో ఉన్న అన్న దాతలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమ పథకాలు ప్రవేశపెట్టార న్నారు. రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా, సకాలంలో ఎరువులు, రుణమాఫీ, ఒంటరి మహిళలకు, బీడీకార్మికులకు, పింఛన్లు, ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు మిషన్‌ భగిరథ, చెరువుల మరమ్మతులకు మిషన్‌ కాకతీయ, కేసీఆర్‌ కిట్లు, అన్ని కులాలకు ఆత్మగౌరవ సంఘ భవనాల మంజూరు, తదితర ఎన్నో సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలతో పాటు ఇవ్వని ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని గిరిజన తండాలనను ప్రత్యేక పంచాయతీలుగా మర్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు.