మరింత శోభాయమానంగా పద్మావతి ఆలయం

టిటిడి వెబ్‌సైట్‌లో పూర్తి సమాచారం
టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం
తిరుపతి,మే3(జ‌నంసాక్షి): తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత శోభాయ మానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం తెలిపారు.
తిరుచానూరులోని పాత అన్నదానం భవనంలో దాదాపు 600 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా అన్ని వసతులతో వేచి ఉండే హాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ తాగునీటి సౌకర్యం, లగేజి, పాదరక్షలు, సెల్‌ఫోన్‌ కౌంటర్లు, మరుగుదొడ్ల వసతి, టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ టిటిడి స్థానికాలయాల ప్రాశస్త్యం తదితర వివరాలను భక్తులు తెలుసుకునేందుకు వీలుగా ఎల్‌ఇడి స్క్రీన్లు, టివిల ద్వారా ప్రసారం చేస్తామని తెలిపారు. టిటిడి వెబ్‌సైట్‌లో భక్తులకు పూర్తి సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఒక నిమిషంలో 35 లక్షల మందికి సంక్షిప్త సమాచారం అందేలా పుష్‌ నోటిఫికేషన్లు, డైనమిక్‌ డాష్‌ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మాధవం, కల్యాణ మండపాలకు ఐఎస్‌వో గుర్తింపు తీసుకొస్తామన్నారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పురావస్తు శాఖ నుండి అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు వేగవంతం చేస్తామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా పంచాయతీల్లో ప్రచారకుల ధ్వారా ధార్మిక కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తామన్నారు. ధర్మప్రచారం, సేవా కార్యక్రమాలు, ఉద్యోగుల సంక్షేమం, టిటిడి రోడ్లలో సుందరీకరణ, పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. తిరుపతిలో 26 కి.విూ మేర ఉన్న టిటిడి రోడ్లలో రంగురంగుల పూలతో కనిపించే బోగన్‌ విల్లే మొక్కలు పెంచుతున్నామని, ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణతో శంఖుచక్రనామాలను ఏర్పాటు చేస్తున్నామని జెఈవో వివరించారు. అవిలాల చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేశామన్నారు. టిటిడి ఉద్యోగుల కోసం దశలవారీగా నాణ్యమైన నివాస భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టిటిడి వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. టిటిడి కాల్‌ సెంటర్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని, భక్తుల నుండి ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌, మెయిళ్ల ద్వారా సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ పుష్కరిణి, తిరుచానూరులోని పద్మ సరోవరంలో లేజర్‌ షో ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జెఈవో వెల్లడించారు. జూన్‌ నెలలో దాదాపు 30 వేల మందికి ఉచితంగా దంత వైద్యపరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.