మరొకరితో వధువుకు ఘనంగా పెళ్ళి

పెళ్ళి చూపులు జరిగాయి.. మాటలు జరిగాయి. ముహూర్తం కట్టుకున్నారు. పెళ్ళి సమయం రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవాయిద్యాలు వినిపిస్తున్నాయి. పెళ్ళి వంటకాల వాసన ఘుమఘుమలాడుతున్నాయి. పెళ్ళిపీటలపై తాను తాళి కట్టనని మొండికేశాడు పెళ్ళికొడుకు. అయితే ఆదుకోవడానికి తాను ఉన్నానంటూ మరో యువకుడు ముందుకు రావడంతో పెళ్ళి మాత్రం ఘనంగా జరిగింది. ఈ సంఘటన తమిళనాడులోని నాగర్ కోయిల్ పట్టణంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
నాగర్ కోయిల్ కీల్ రామన్ పుదూర్ ప్రాంతానికి చెందిన మణికంఠన్ (26)కు అదే ప్రాంతానికి చెందిన సరలూర్‌కు చెందిన  ఉమా ప్రియతో వివాహం నిశ్చయమైంది. పెళ్ళి పత్రికల పంపకాలు పూర్తయ్యాయి. రాత్రి నలుగులు అయిపోయాయి. ఇక పెళ్ళి సమయం దగ్గర పడింది. వడివీవ్వరం అళగమ్మాల్ ఆలయంలో తాళికట్టు శుభకార్యం జరగవలసి ఉంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం వధువుకు, వరుడికి ఇది మొదటి వివాహం అని తెలుపు వివాహ నిర్ధారణ పత్రాన్ని ఆలయ అధికారులకు సమర్పించవలసి ఉంది. ఇక్కడ ఏమయ్యిందో ఏమో తెలియదుగానీ, ఆ పత్రంలో సంతకం చేయడానికి వరుడు ససెమిరా అన్నాడు. సంతకం చేయనని మొండకేశాడు. దీంతో అందరూ షాక్ తిన్నారు. చివరకు వధువు మెడలో తాళి కట్టేందుకు నిరాకరించాడు. 
దీంతో పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు కుటుంబాలకు మధ్యన గొడవ రేగింది. వధువు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్ళి పీటలపై ఆపేయడం వలన తమ పరువు పోయిందని మండిపడ్డారు. పైగా వివాహా ఏర్పాట్లకు చాలా ఖర్చు అయిందని ఆ మొత్తం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని మణికంఠన్, అతని తల్లిని పోలీస స్టేషన్‌కు తరలించారు. 
అయితే బలవంతపు పెళ్ళి చేయడం సరికాదునుకున్న వధువు తల్లిదండ్రులు వెంటనే అదే పెళ్లిమండపంపై పెళ్ళి చేయడానికి వరుడి కోసం వెదికారు. చివరకు దూరపు బంధువు గోపకుమార్ (32)తో ఉమాప్రియకు ఘనంగా వివాహం జరిపించారు. ఖర్చులపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పోలీసులు విచారణ చేస్తున్నారు.