మరోమారు పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతూ వినియోగదారుల గుండె గుబేల్‌మన్పిస్తున్నాయి. శనివారం కూడా ఈ ధరలు మరికాస్త పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 18పైసలు పెరిగి రూ. 82.66కు చేరింది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.12గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.48, చెన్నైలో రూ. 85.92గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ. 88మార్క్‌కు మరింత చేరువైంది. నేడు నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 87.63గా ఉంది. ఇక డీజిల్‌ ధర కూడా నేడు 29-31 పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 75.19కు చేరగా.. ముంబయిలో రూ. 78.82, కోల్‌కతాలో రూ. 77.04, చెన్నైలో రూ. 79.51, హైదరాబాద్‌లో రూ. 81.79గా ఉంది. రూపాయి పతనం, ముడిచమురు ధరలు పెరగడం, అధిక సుంకాల కారణంగా గత కొంతకాలంగా దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చమురు భారం నుంచి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. పెట్రో ఉత్పత్తుల ధరలను లీటర్‌కు రూ.2.50మేర తగ్గించింది. పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 మేర తగ్గిస్తున్నామని, అలాగే చమురు కంపెనీలూ ఒక రూపాయి తగ్గించుకుంటాయని గతవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.