మరోమారు రైతు నెత్తిన పిడుగు
కొనుగోళ్లలో ఆలస్యంతో నష్టపోతున్న రైతులు
కరీంనగర్,మే14(జనంసాక్షి): అకాల వర్షంతో మరోమారు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ధాన్యం కొంటే తప్ప వారునష్టం నుంచి గట్టెక్కు పరిస్థితి లేదు. కొనుగోలు పక్రియ జాప్యం కావటంతో మంథని,
పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోవటంతో నష్టం చోటుచేసుకుంది. తడిచిన ధాన్యం కుప్పల మధ్య నిలిచిని నీటిని బయటకి పంపించేందుకు రైతులే కూలీలను పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రేడింగ్ జరిగిన రోజులోనే కొనుగోలు చేయాల్సి ఉండగా లారీలు రావడం లేదని, హమాలీలు తక్కువగా వస్తున్నారనే రకరకాల కారణాలతో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా కొనసాగటం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. కొనుగోలు కేంద్రాల వారీగా మిల్లులను కేటాయించిన తర్వాత కూడా ఈ పరిస్థితి నెలకొంది. ఎక్కువ మంది రైతులు ఒకేసారి మార్కెట్‌కు రావడంతో కొనుగోలు పక్రియ ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ కొనుగోలు కేంద్రాల్లో 10 వేల క్వింటాళ్ల ధాన్యం వరకు తడిచిపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలు చేశారు. ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో నష్టం ఎక్కువ జరిగింది. వేకువజామున కురిసిన భారీ వర్షానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన వరితోపాటు పలు కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసింది. అధికారుల నిర్లక్ష్యంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌లో వర్షానికి ధాన్యం తడిచి రైతులు అవస్థలు పడ్డారు. వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు రైతులకు కవర్లు ఇవ్వకపోవడంతో పెద్దఎత్తున నష్టం జరిగింది. రబీలో వచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతుకు ప్రభుత్వ సంస్థలు అనుసరిస్తున్న ధోరణి ఇబ్బందులకు గురిచేస్తుంది.
రైతులు కష్టపడి పండించిన పంటలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఆకాల వర్షంతో పంట దిగుబడులు తడిసి ముద్దయ్యాయి. హుజూరాబాద్ మండలం కందుగులలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి పెద్ద మొత్తంలో ధాన్యం తీసుకొచ్చారు. కేంద్రంలోని ధాన్యం కుప్పల్లో మొత్తం నీరు చేరింది. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పంటలు తడవకుండా టార్ఫాలిన్ కవర్లు కప్పినా అందులోకి సైతం నీరు చేరింది. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల పరిధిలో కురిసిన అకాల
వర్షంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో కేంద్రాలు జలమయంగా మారిపోయాయి. కేంద్రాలలో పలువురు రైతులు అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లను ధాన్యంపై కప్పుకొన్నారు. టార్ఫాలిన్ కవర్లు సరిపడ లేకపోవడంతో తమ ధాన్యం తడిసిపోయిందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
–