మరోసారి అవకాశం!

– మళ్లీ అంతరిక్షంలోకి సునీత విలియమ్స్‌
– నాసా వెల్లడించిన వ్యోమగాముల బృందంలో సునీత పేరు
వాషింగ్టన్‌, ఆగస్టు4(జ‌నం సాక్షి ):  భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్‌ కు అంతరిక్షంలోకి వెళ్లేందుకు మరోసారి అవకాశం లబించింది. తొమ్మిది మంది వ్యోమగాములతో కలిసి సునితా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. స్పేస్‌ఎక్స్‌, బోయింగ్‌ సంయుక్తంగా రూపొందించిన రాకెట్స్‌, క్యాప్సుల్స్‌లో నాసా ఈ తొమ్మిది సిబ్బందిని అంతరిక్షంలోకి పంపించనుంది. 2011 తర్వాత అమెరికా తొలిసారిగా మానవులను తీసుకెళ్లే కమర్షియల్‌ స్పేస్‌క్రాఫ్ట్స్‌ను పంపిస్తోంది. ఇందులో ఎనిమిది మంది నాసాకు చెందిన క్రియాశీల వ్యోమగాములు ఉన్నారని, ఒకరు మాజీ వ్యోమగామి ఉన్నారని నాసా వెల్లడించింది. 2019లో వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది. టెస్ట్‌ పైలట్స్‌లో వెళ్లే వ్యోమగాముల జాబితాతో పాటు స్టార్‌లైనర్‌, డ్రాగోన్‌ మిషన్స్‌లో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను నాసా వెల్లడించింది. సిబ్బందిని తీసుకెళ్లే వాహక నౌకలు నాసా సహకారంతో తయారయ్యాయి. స్టార్‌లైనర్‌లో 52ఏళ్ల సునీత విలియమ్స్‌తో
పాటు 45ఏళ్ల జోష్‌ కస్సాడా ప్రయాణించనున్నారు. కస్సాడాకు ఇది తొలి స్పేస్‌పైలట్‌. సునీత విలియమ్స్‌ గతంలో 321 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. 2012లో ఆమె భూమిపైకి తిరిగొచ్చారు. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన డ్రాగోన్‌లో నాసా వ్యోమగాములు రాబర్ట్‌ బెహెన్‌కెన్‌(48), డోగ్లస్‌ హర్లే(51) అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు.
——————————————