మరోసారి చిక్కుల్లో తమిళనాడు గవర్నర్‌ 

– జర్నలిస్టు లక్ష్మీ చెంపను నిమిరిన గవర్నర్‌
– గవర్నర్‌ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన జర్నలిస్ట్‌
– ఘటనపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు
–  గవర్నర్‌ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు
చెన్నై, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి) : తమిళనాడు గవర్నర్‌ భన్వరిలాల్‌ పురోహిత్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మంగళవారం  సాయంత్రం జరిగిన విూడియా సమావేశంలో మహిళా పాత్రికేయురాలు లక్ష్మీ సుబ్రమణియన్‌తో ఆయన అనుచితంగా ప్రవర్తించారు. ద వీక్‌ పత్రిక జర్నలిస్టు లక్ష్మీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేస్తూ ఆమె చెంపను తట్టడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్‌ పురోహిత్‌ ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల సంచలనం రేపిన ప్రొఫెసర్‌ నిర్మలా దేవి అంశంపై విూడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనేక ప్రశ్నలకు ఆ కాన్ఫరెన్స్‌లో గవర్నర్‌ సమాధానం ఇచ్చారు. ప్రొఫెసర్‌ నిర్మలాదేవి ఓ కాలేజీకి చెందిన నలుగురు అమ్మాయిలను సెక్స్‌వర్క్‌లుగా మార్చేందుకు ప్రయత్నించింది. ఆ అంశం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెను చర్చకు దారి తీసింది. ఆ వివాదాస్పద ప్రొఫెసర్‌కు గవర్నర్‌ పురోహిత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్‌ కొట్టిపారేశారు. చాలా ఆగ్రహంగా ఆయన సమాధానాలు ఇచ్చారు. ఇక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ముగిసే సమయంలో జర్నలిస్టు లక్ష్మీ ఓ ప్రశ్న వేసింది. ప్రభుత్వ పర్ఫార్మెన్స్‌తో సంతృప్తికరంగా ఉన్నట్లు విూరు తెలిపారు కాదా, మరి రాష్ట్రంలోని వర్సిటీల పనితీరు బాగుందని విూరు భావిస్తున్నారా అని ఆమె అడిగారు. ఆ సమయంలో కూర్చీలోంచి లేచిపోతూ.. గవర్నర్‌ పురోహిత్‌ ఆ జర్నలిస్టు బుగ్గను తట్టారు. ఈ ఘటనతో జర్నలిస్టు లక్ష్మీ కొంతసేపు నిర్ఘాంతపోయారు. వెంటనే వాష్‌రూమ్‌కు వెళ్లి ఆ స్థితి నుంచి కోలుకునే ప్రయత్నం చేశారు. కానీ బాధ్యతాయుతమైన ¬దాలో ఉన్న ఓ వ్యక్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చెంపను తాకడం ఎంత వరకు సమంజసమని ఆ జర్నలిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఓ మహిళను తాకడం అసభ్యమే అవుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.  కాగా ప్రతిపక్ష పార్టీల్లోని నేతలుసైతం గవర్నర్‌ తీరును తప్పుబడుతున్నారు.