మరోసారి రణరంగమైన సిర్సా

బీభత్సం సృష్టించిన డేరా బాబా అనుచరులు

అప్రమత్తమైన హర్యానా, పంజాబ్‌ రాష్టాల్రు

సిర్సా,ఆగస్టు28 : హర్యానా మరోసారి రణరంగమైంది. డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ అనుచరులు మరోసారి గూండాగిరి ప్రదర్శించారు. అత్యాచారం కేసులో గుర్మీత్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే సిర్సాలోని ఆయన అనుచరులు, అభిమానులు అల్లర్లు సృష్టించారు. ఫూల్కా ప్రాంతంలో రెండు కార్లను తగులబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో హర్యానా, పంజాబ్‌

సీఎంలు మనోహల్‌ లాల్‌ కట్టర్‌, అమరీందర్‌సింగ్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిని సవిూక్షించారు. తీర్పు వెలువడిన వెంటనే చండీగఢ్‌లోని తన నివాసంలో హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఉన్నతాధికారులు, బీజేపీ నాయకులు, మంత్రులతో చర్చించారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆందోళనలకు అవకాశం ఇవ్వరాదని ఖట్టర్‌ ఆదేశించారు. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కూడా పోలీసు ఉన్నతాధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. తమ రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని, అవాంఛనీయ సంఘటనలను అదుపు చేసేందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని అమరీందర్‌ సింగ్‌ తెలిపారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు కోర్టు విధించిన శిక్షను ప్రజలు ఆమోదించాలని, శాంతిని కాపాడాలని ఆయన కోరారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ అత్యాచార కేసులో సీబీఐ కోర్టు తీర్పును సీఎం అమరిందర్‌ సింగ్‌ స్వాగతించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని తెలిపారు. పరిస్థితి మంగళవారం సవిూక్షించి కర్ఫ్యూ ఎత్తివేతపై ప్రకటన చేస్తామన్నారు. ఇక ఇంటర్నెట్‌ సేవలు కూడా మంగళవారం పునరుద్ధరిస్తామన్నారు. భద్రతపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సవిూక్ష నిర్వహిస్తున్నట్లు అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. మరోవైపు రోహతక్‌లోని సునారియా జైలు పరిసరాల్లో భద్రతను కట్టు దిట్టం చేశారు. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీలో హైఅలర్ట్‌ ప్రకటించి కీలక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.ఈ నెల 25న గుర్మీత్‌ను దోషిగా నిర్థారిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జస్టిస్‌ జగ్దీప్‌ సింగ్‌ తీర్పు వెలువరించగా.. పంజాబ్‌, హర్యానా, తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆయన మద్దతుదారులు, అభిమానులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. హర్యానాలోని పంచకులలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మూడు విూడియా వాహనాలకు నిప్పుపెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠిచార్జి చేసి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో చాలా మంది గాయపడ్డారు. ఇక పంజాబ్‌లోని మాలౌట్‌ రైల్వే స్టేషన్‌, పెట్రోల్‌ పంపునకు నిప్పుపెట్టారు. బతిండా ప్రాంతంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రైల్వే శాఖ రెండు రాష్టాల్లో 201 రైళ్ల సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రోహ్‌తక్‌ న్యాయస్థానం వద్ద ఐదంచెల భద్రత ఏర్పాటుచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్ర, కేంద్ర బలగాలతో అన్ని ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. సిర్సాలో సైన్యం ఎ/-లాగ్‌ మార్చ్‌ కూడా నిర్వహించింది. అయినప్పటికీ విధ్వంసం మాత్రం ఆగలేదు. మరోవైపు అనుచరులంతా శాంతియుతంగా ఉండాలని డేరా సచ్చా సౌధా ఛైర్‌పర్సన్‌ విపాసనా ఇన్సాన్‌ విజ్ఞప్తి చేశారు.