మరో మూడు నెలల్లో ఇళ్లనిర్మాణాలు పూర్తి
లక్ష్యం మేరకు ఇళ్లను పూర్తి చేస్తాం: భూమారెడ్డి
కామారెడ్డి,జూన్21(జనం సాక్షి): నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సిఎం కెసిఆర్ ఇచ్చిన హావిూ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లనిర్మాణం శరవేగంగా సాగుతోందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమారెడ్డి తెలిపారు. విపక్షాలు విమర్శలు మాని ఆయా నియోజకవర్గాల్లో పూర్తవుతున్న ఇళ్లను చూడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 65 వేల 868 నిర్మాణాలు ప్రగతిలో ఉండగా, 11 వేల 868 నిర్మాణాలు పూర్తి అయ్యాయని అన్నారు. ఆయా జిల్లాల్లో పూర్తి అయిన ఇళ్ల నిర్మాణాలకు, జీహెచ్‌ఎస్ పరిధిలో నిర్మించిన ఇళ్లకు కలిపి రాష్ట్రంలో ప్రభుత్వం 16 వేల 992 కోట్ల 32 లక్షల బిల్లులు చెల్లించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో మరో మూడు నెలలో వేల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి సర్కారు పాటు పడుతోందని అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో లక్షా 74 వేల 116 డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేసిందని తెలిపారు.రాష్ట్రంలో లక్షా 51 వేల 846 ఇండ్ల నిర్మాణాలకు గాను లక్షా 28 వేల 846 ఇండ్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. 88 వేల 979 గృహాలకు టెండర్లు పూర్తి అయిందని అన్నారు. జీహెచ్‌ఎస్ ప్రాంతాల్లో వెయ్యి ఇండ్లు మంజూరయ్యాయని, 98 వేల 428 నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 572 నిర్మాణాలు పూర్తి అయినట్లు తెలిపారు.