” మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండకల్ శంకర్ గౌడ్ పాత్ర స్ఫూర్తిదాయకం – తెలంగాణ ఉద్యమకారులు “
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం స్వప్నం సాకారమైన తెలంగాణ మలి ఉద్యమంలో శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలో నాటి ఉద్యమకారుడు కొండకల్ శంకర్ గౌడ్ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ ఉద్యమకారులసంఘం సీనియర్ నాయకులు మిద్దెలమల్లారెడ్డి స్పష్టంచేశారు. ఈమేరకు కొండకల్ శంకర్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని చందానగర్ గాంధీ విగ్రహంవద్ద ఉద్యమకారులు శుక్రవారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండకల్ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మల్లారెడ్డి, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ తదితరులు మాట్లాడుతూ 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకుని అంచలంచలుగా ముందుకు సాగుతూ 2009 నుండి మలిదశ ఉద్యమంగా రూపుదిద్దుకొని ఉవ్వెత్తున ఎగిసి పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రానికి సిసలైన పునాదులు కూడుతున్న ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రాంతంనుండి కొండకల్ శంకర్ గౌడ్ ఎంతో నిర్మాణాత్మకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలిగాడని వారన్నారు. ఎంతోమంది యువకులను, తెలంగాణ బిడ్డలను ఉద్యమంవైపు మళ్లించి ఈ ప్రాంతం నుండి మలి ఉద్యమానికి బలమైన గొంతుకగా కొండకల్ నిలిచారు అనడంలో సందేహమే లేదన్నారు. మలి ఉద్యమానికి ఊపిరిలూదిన శంకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఫలాలను అనుభవించకుండానే అనంత లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరమని, ఉద్యమాన్ని ఊపిరిగా భావించి ప్రత్యేకరాష్ట్ర సాధనే ధ్యేయంగా అవిశ్రాంతంగా పోరాడిన ఆయన పోరాటాన్ని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని వక్తలు నొక్కి వక్కాణించారు. రాబోయే కొండకల్ జయంతి నాటికి తన విగ్రహాన్ని శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పరిధిలో ప్రతిష్టించాల్సిన ఆవశ్యకతను మిద్దెల బాల్ రెడ్డి తదితరులు ఎత్తిచూపారు. తెలంగాణ ఉద్యమకారులంతా తలా ఒక రూపాయిని చందాగా చేర్చి కొండకల్ విగ్రహాన్ని తయారు చేయించడానికి పూనుకోవడం శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో నమస్తే శేరిలింగంపల్లి ప్రతినిధి పుట్ట వినయ్ కుమార్, తెరాస నేత చాంద్ పాషా, రమణారెడ్డి, గంగారం సంగారెడ్డి, తిరుమలేష్ నిమ్మల శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, డాక్టర్ రమేష్, షేక్ జమీర్, రమణ, హనీఫ్, ధరం వీర్, ఉమేష్, మధు కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.