మలేషియా ఓపెన్‌లో సింధూ, శ్రీకాంత్‌ ఔట్‌

కౌలాలంపూర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : మలేషియా ఓపెన్‌లో సింధు చేతులెత్తేసింది. శనివారం జరిగిన సెవిూఫైనల్లో తైపికి చెందిన తాయ్‌ జూ చేతిలో ఓడిపోయింది. తైపి ప్లేయర్‌ 21-15, 19-21, 21-11 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్‌ సింధు చాలా ఇబ్బందులు పడింది. తైపి ప్లేయర్‌ చాకచక్యంగా షాట్లు కొడుతూ సింధును ముప్పుతిప్పలు పెట్టింది.  ఫస్ట్‌ గేమ్‌ను తాయ్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇక సెకండ్‌ గేమ్‌లో సింధు తన సత్తాను చూపాల్సి వచ్చింది. అతికష్టంగానే ఆమె సెకండ్‌ గేమ్‌ను గెలుచుకుంది. దీంతో నిర్ణయాత్మక మూడవ గేమ్‌ ఆసక్తిని రేపింది. కానీ డిసైడింగ్‌ గేమ్‌లో సింధు సరిగ్గా పర్ఫార్మ్‌ చేయలేదు. సింధు పదేపదే పొరపాట్లు చేసింది. తైపి ప్లేయర్‌ అతి సునాయాసంగా గేమ్‌ను గెలుచుకుంది. దీంతో తాయ్‌ జూ ఫైనల్లోకి ప్రవేశించింది. సింధు ఈ మ్యాచ్‌లో ఈజీ పాయింట్లను కూడా స్కోర్‌ చేయలేకపోయింది. అనేక అవకాశాలను సింధు చేజార్చుకుంది. ప్రెజర్‌లో పడిపోయిన హైదరాబాదీ.. బలమైన షాట్లను కొట్టలేకపోయింది. మూడవ గేమ్‌లో తైపి ప్లేయర పూర్తిగా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. డిసెప్టివ్‌ ష్మాష్‌లతో తైపి ప్లేయర్‌ ఆకట్టుకుంది. బేస్‌లైన్‌ షాట్లతో తాయ్‌ అలరించింది.
పురుషుల విభాగంలో శ్రీకాంత్‌ ఓటమి..
పురుషుల సింగిల్స్‌ సెవిూస్‌లో కెంటొ మొమొట (జపాన్‌)తో తలపడిన శ్రీకాంత్‌ 13-21, 13-21 తేడాతో ఓడిపోయాడు. ఏ ఒక్క గేమ్‌లోనూ కెంటొకు శ్రీకాంత్‌ పోటీ ఇవ్వలేకపోయాడు. సెవిూస్‌కు భారత్‌ నుంచి సింధు, శ్రీకాంత్‌ మాత్రమే చేరుకున్నారు. ఇప్పుడు వారిద్దరు కూడా ఓటమి పాలవ్వడంతో ఈ టోర్నీలో భారత్‌ పోరు ముగిసినట్లైంది.